Monday, December 23, 2024

స్వరాష్ట్రం సిద్దిస్తేనే ప్రజలకు చక్కటి పాలన: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెదక్: స్వరాష్ట్రం సిద్దిస్తేనే ప్రజలకు చక్కటి పాలన అందిస్తామని 2001లోనే సిఎం కెసిఆర్ మదిలో ఒక దృఢ సంకల్పం ఏర్పరచుకొని రాష్ట్రం సిద్దించిన తర్వాత అందరి ఆలోచనలకుఅనుగుణంగా జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ అత్యంత పారదర్శకమైన సుపరిపాలన అందించుటకు వివిధ శాఖలను పునర్వవస్థీకరించి, సిబ్బందితో పాటు అధికారులు, అవసరమైన నిధులు అందజేస్తూ బలోపేతం చేసిందని అన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా ఏకగవాక్ష పద్దతిలో గడువులోగా అనుమతిస్తూ ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రజలకు చేరువలో ఉంటూ సమర్థవంతమైన సేవలందిస్తున్నదని అన్నారు.

రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పి రోహిణి ప్రియదర్శినిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ పనుల నిమిత్తం వ్యయప్రయాసాలకోర్చి వెళ్లినా కొన్నిసార్లు పనులు అయ్యేవి కావని,కానీ నేడు నూతనంగా మెదక్ జిల్లా ఏర్పాటుతో పాటు రెండు రెవెన్యూ డివిజన్లు,మూడు మున్సిపాలిటీలు, ఆరు మండలాలు,157 గ్రామపంచాయతీల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత చేరువై సుపరిపాలన అందించుటకు, మానిటరింగ్ చేయుటకు సుళువైందని అన్నారు.

అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నిర్మించిన సమీకృత నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసుకార్యాలయ భవనాలను త్వరలో ప్రారంభించుకోబోతున్నామని , తద్వారా వివిధ కార్యాలయాలలో పనులు నిమిత్తం వచ్చే ప్రజలకు ప్రయాస తప్పుతుందని అన్నారు. పరిపాలనో సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రతి శాఖ ప్రజలకు మరింత చేరువై బాద్యతగా పనిచేస్తున్నాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఇన్నోవా వాహనాలు,నిధులు కేటాయింపు, షీటీమ్‌ల ఏర్పాటు చేసి ప్రెండ్లీపోలీస్ వాతవరణం కల్పించిందని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిద్వారా సౌకర్యాలు ఏర్పడ్డాయని ప్రజలు గ్రామాలలో ఉండటానికి మొగ్గుచూపుతున్నారని, ఇదే తెలంగాణ సాదించిన ప్రగతికి గీటురాయని అన్నారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ బండికి రెండు చక్రాల్లా అభివృద్ధ్ది, సంక్షేమంలో ప్రభుత్వం దూసుకెళ్లుతుందని, నేడు ఏ రాష్ట్రం వెళ్లినా మన రాష్ట్రంలో బ్రహ్మండంగా జరుగుతున్న అభివృద్ది గురించి అడుగుతున్నారని అన్నారు.ప్రజల సౌలభ్యం కోసం పాలన వ్యవస్థను వికేంద్రీకరించి అందిస్తున్న సుపరిపాలనపై దేశం యావత్తు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… ప్రజలకు చేరువలో మానవీయ కోణంలో పారదర్శకంగా సేవలందిస్తున్నప్రభుత్వం ఉత్తమమని,ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువలో సుపరిపాలన అందిస్తూ మన్ననలుపొందుతున్నదనిఅన్నారు. ప్రతి కార్యక్రమంలో పారదర్శకంగా ఉండేలా ఆన్‌లైన్ వ్యవస్థ పటిష్ట పరిచి టిఎస్ ఐపాస్, టిఎస్ బిపాస్, ధరణి, మీసేవ వంటి విదానాల ద్వారా ఒక్క పైసా ఖర్చు లేకుండా గడువులోగా అనుమతులిస్తున్నదని అన్నారు.

ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ రాష్ట్రం, దేశం అభివృద్ధి శాంతిభద్రతలపై ఆదారపడి ఉంటుందని, శాంతిభద్రతలు అదుపులో ఉంటే అభివృద్ధి వికసిస్తుందని అన్నారు. పాలన వికేంద్రీకరణలో బాగంగా అదనపు పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వల్ల పరిధి తగ్గి ప్రజలకు మరింత చేరువకావడం,వాహనాలకేటాయింపు, నిధులు మంజూరు వల్ల సులువుగా మానిటరింగ్ చేయుటకు, నేరాలనుఅరికట్టుటకు వీలయ్యిందని అన్నారు. అంతకుముందు సుపరిపాలన దినోత్సవ కరపత్రాన్ని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మునిస్పల్ చైర్మన్ చంద్రపాల్, బొంది రవీందర్‌గౌడ్, వివిధ మండలాల అధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి, హరిక్రిష్ణ, సిద్దిరాములు,వినోద, జడ్పిటిసి కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News