Monday, November 18, 2024

మంచి జీవితం

- Advertisement -
- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం పక్కనే సరిపల్లె, అప్పుడు ఆ గ్రామంలో ప్రభుత్వ స్కూలు గాని, హాస్పిటల్ గాని లేవు. అంత చిన్న ఊరు. ఊరికే అదే పెద్ద రోడ్డు. ఆ వీధిలోని చాగంటి శంకరం గారి ఇంటికి పక్కనే పెద్ద పెరడు. అందులో పెద్ద పాక. అదే మా స్కూలు. మా మేస్టారు జానకి రామయ్య గారు. ఆ స్కూలుని జానకి రామయ్య గారి స్కూలనే అనేవారు. మొత్తం మా ముప్ఫై అయిదు గురికి ఆయన మాస్టారు. మమ్మల్ని తరగతల వారీగా వేర్వేరు గుంపుగా కూచోపెట్టి చదువు చెప్పేవారు. ఇక్కడ మేం నేర్చుకోటం అయిపోయాక, గణపవరం ప్రభుత్వ పాఠశాలల చేర్పించే వారు ఆయన. ఆయన అలా చేసుండకపోతే, మాలో చాలా మంది చదువు వచ్చేదే కాదేమో.

మా ఆ స్కూలు పొద్దన్న ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే. ఒంటి గంట నుంచి రెండింటి వరకు భోజన విరామం. రెండింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఆడకునే సమయం. మాకు పొద్దున్న కన్నా సాయంత్రం మంచి సరదాగా వుండేది. అదేదో ప్రకృతి బడిలాగో గురుకులం లాగో వుండేది. స్కూలు పాక చుట్టూ రకరకాల చెట్లు, ఎన్ని రకాల ఆటలో. మేం ఆడుకుంటున్నా, మాస్టారు మమల్ని వదిలేసే వారు కాదు. ఓ చెట్టు కింద కుర్చీ వేసుక్కూచుని అక్కడే వుండే వారు.నాకు పెద్దగా ఆటల మోజుండేది కాదు. మాస్టారి దగ్గరే ఎక్కువుగా గడిపేవాడిని. ఆ సమయంలో ఎన్నెన్నో రకాల విషయాలు చెపుతుండేవారు.

‘ఒరేయ్ కిరణ్.. ఈ ఆటల గురించి ఓ మాట చెపుతాను. జాగ్రత్తగా విను. ఆటలు ఆడేటప్పుడు వాటితో కలిసిపోతాం. మైమరచిపోతాం. పడిపోతామేమో, దెబ్బలు తగులుతాయేమోనని ఆలోచించం. ఒకవేళ పడిపోయి దెబ్బలు తగిలితే వాటిని భరిస్తాం. జీవితం కూడా అంతేరా. అన్ని మనకి సుఖంగానే జరగవు. అనుకోని కష్టాలొస్తాయి. బాధలొస్తాయి. వాటికి దిగులు పడిపోకూడదు. అవన్నీ జీవితంలో భాగమేనని సరిపెట్టుకొని ముందుకు సాగిపోవాలి! ఇలా మాస్టారు పాఠాలకి సంబంధం లేని చాలా విషయాలు చెప్పేవారు. వాటిలో చాలా నా మనసులో, చిన్న వయస్సులోనే బలంగా ముద్ర పడిపోయాయి.
‘అన్నింటికన్నా, ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. అది బావుంటేనే జీవితంలో ఏ సంతోషమేనా ఆరోగ్యానికి చెడు చేసే ఏ అలవాటు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు. ఆరోగ్యం మీద శ్రద్ధ అంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోటమే’ అనే వారు మాస్టారు. స్కూల్లో రోజూ మాచేత వ్యాయామం చేయించేవారు.

జానకి రామయ్య గారి దగ్గర చదువంటే, ఉట్టి పుస్తకాల చదువేకాదు. జీవితపు చదువు. ఆయన దగ్గర నా స్కూలు చదువు అయిపోయాక కూడా నేను ఆయన్ని వదలలేదు. నా పోస్టు గ్రాడ్యుయేషన్ అయిపోయి అమెరికా వెళ్ళాక కూడా యాడాదిలో రెండు మూడు సార్లేనా ఫోన్ ద్వారా ఆయనని పలకరించడం నాకు అలవాటుగా మారింది. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఫోన్ కలవటం కష్టం. అయినా కూడా ఇబ్బందిగా అనిపించేది కాదు. ఆయనతో మాట్లాట్టమే మహాభాగ్యంలా వుండేది. నా పెళ్ళి కూడా అమెరికాలోనే అయింది. మాస్టారి ఆశీర్వాదం కోసం ఫోన్ చేశాను. అప్పుడు ఆయన పంచాయితీ స్కూల్లో టీచర్.
“చాలా సంతోషం కిరణ్. బాల్యం మనకి తెలిసీ తెలియకుండా దాని విలువ పట్ల స్పృహ లేకుండా గడిచిపోతుంది. యవ్వనం అలా కాదు. ఆ వయస్సు మనకి తెలుస్తూ గడుస్తుంది. యవ్వనం మొత్తం జీవితంలో, అత్యంత విలువైన కాలం. అప్పటి అనుభవాలే మన జీవితాన్ని వెలిగిస్తాయి. బైట పనులు, సంపాదనా ముఖ్యమే.

కాని వీటికన్నా చాలా చాలా ముఖ్యం నీ భార్య. నీతోడు నీడ ఆవిడకి అన్నింటికన్నా ఎక్కువ విలువ ఇవ్వాలి. ముఖ్యంగా సమయం కేటాయించాలి. మరిచిపోకు అన్నారు. ఆయన ఆ మాటలు నాకు దివ్య ఔషధంలా పని చేశాయి. మా దాంపత్య జీవితానికి అది చాలా గట్టి పునాది అయింది. ఇలా మాస్టారు నాలో చదువునే కాదు, జీవిత సారాన్ని, అమృత సమానమైన జీవన రీతిని నింపారు. ప్రతి ఉపాధ్యాయుడు, జానకి రామయ్య మాస్టారిలా పిల్లలకి చిన్నతనం నుంచీ, చదువుతో పాటు ఇలా జీవితం గురించి కూడా బోధిస్తే, ఎంతో నాణ్యమైన జీవన సమూహం తయారవుతుంది. అలాంటి మేస్టారితో పది హేనేళ్ళుగా సంబంధం తెగిపోయింది. ఉద్యోగం మార్పు, బదిలీల వల్ల రకరకాల ఊళ్ళు మారారని తప్ప ఎక్కడున్నదీ తెలియడం లేదు. ఎందరెందర్నో అడిగాను. తిరిగి స్వగ్రామం సరిపల్లె వెళ్ళి అక్కడే వుంటున్నారని తప్ప మరే వివరాలు గాని, చిరునామా, ఫోన్ నెంబర్ గానీ దొరకలేదు.
ఇన్నాళ్ళకి ఆయన్ని వెతుక్కుంటూ బైలు దేరే అవకాశం కుదిరింది. చాలా ఆతృతగా వుంది. మాస్టారు దొరుకుతారో, లేదోనని చాలా మందికి నాదో చాదస్తంలా అనిపించవచ్చు. ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం పాఠాలు చెప్పిన పల్లెటూరి స్కూలు మాస్టార్ని ఇప్పుడు అమెరికానించి వచ్చి, పని కట్టుకు వెతకటమేమిటీ? అనిపించొచ్చు. కాని జానకి రామయ్య నాకు ఉత్తి మాస్టారే కాదు. ఆయన ఎంతో విలువైన మాటలతో నా జీవితాన్ని గొప్పగా నడిపించిన చుక్కాని. కన్న తండ్రి కాకపోయినా, నా జీవితంలోని మంచి చెడ్డలన్నింటికీ గొప్పఅండ. కంటికిరెప్పలా కాపాడుకొచ్చిన, నా జీవితాన్ని పూర్తి ప్రయోజనకరంగా తీర్చిదిద్దిన పెంపుడు తండ్రి. నా వయసే యాభై పైన. మాస్టారికి ఎనభై దాటి వుంటుంది. ఎలా ఉన్నారో? ఏమిటో? రాజమండ్రి వరకు విమాన ప్రయాణం. అక్కడ కారు మాట్లాడుకున్నాను. మరో గంటలో గణపవరం చేరతాను. అక్కడ్నించి మరో పది నిముషాలు పావు గంట సరిపల్లె. ఊరు, మాస్టారి ఇల్లు లీలగా గుర్తున్నాయి. కాని మేస్టారు ఆ ఇంట్లో ఉన్నారో? లేదో? ఆతృత పడకూడదని అనుకుంటున్నా, ఆతృతతానే వుంది.
కొంచెం తడిపడినా ఆ వీధి గుర్తు పట్టాను. చాగంటి శంకరం గారి ఇల్లు ముందు మా స్కూలు వుండే పెరటి స్థలంలో ఇల్లు కట్టేశారు. కారు అక్కడ ఆపించి, శంకరం గారింటిలోకి వెళ్ళాను. శంకరంగారి తాలూకు వాళ్ళే వున్నారు. మాస్టారు ఆయినింట్లోనే వుంటున్నారని, ఆనమాళ్ళు చెప్పారు. అమ్మయ్య.. మాస్టారు వున్నారన్న తృప్తి. ఆతృత కొంచెం తగ్గినా మాస్టార్ని చూడాలన్న తహ.. తహ. మాస్టారిల్లు బాగా పాతబడిపోయింది. ముందు వసారాలోనే వున్నారు మాస్టారు. “ఎవరూ?” అన్నారు నన్ను చూసి. నా వివరం చెప్పాను. “నువ్వా కిరణ్.. ఎన్నేళ్ళయిపోయింది చూసి… నువ్విలా రావడం ఏనుగెక్కినంత సంబరంగా వుంది” అన్నారు నిండుగా నవ్వుతూ లోపల నుంచి ఓ నలభై ఏళ్ళతను వచ్చాడు.

అతన్ని చూపిస్తూ “మా అబ్బాయి చలపతి.. ఒక్కడే సంతానం.. వీడికి ఒక కొడుకు, కూతురు. చిన్నవాళ్ళే… స్కూలుకెళ్ళారు. సాయంత్రానికి వస్తారు. చలపతీ, కిరణ్ సామాను లోపలికి తీసుకురా. కిరణ్ నా ప్రియ శిష్యుడు. చిన్నప్పుడు ఎప్పుడూ నాకూడా కూడానే వుండేవాడు” అన్నారు. నేను మాస్టారి ఎదురుగానే కూచున్నాను. ఆప్యాయంగా నా రెండు చేతులూ ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. చాలా కబుర్లు సాగాయి. చలపతి భార్య కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆ ఇల్లు, ఇంటి వాతావరణం చూస్తుంటేనే తెలుస్తోంది మాస్టారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని. మొత్తం అయిదుగురు వుంటున్న ఇల్లు. చలపతి ఏ ఉద్యోగం లేదు. డిగ్రీ చదివాడు. పెద్ద వయసులో వున్న తండ్రిని ఒంటరిగా వదలలేడు. వున్న చిన్న ఊళ్ళో ఉద్యోగావకాశాలు తక్కువ.
మాస్టారి కొచ్చే పెన్షన్ చాలా తక్కువ. అతి కష్టంగా ఆ సంసారం గడుస్తోందని చలపతి ద్వారా తెలిసింది.

నాలో ఆలోచన సాగుతోంది. కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బు ఇవ్వచ్చు. కానీ దాని వల్ల ఉపయోగం తాత్కాలికం. ఇప్పుడు ఆ ఇంటికి క్రమం తప్పని అదనపు ఆదాయం కావాలి. అటువంటి ఆధారం కావాలి. నేనే ప్రతి నెలా ఇంతని డబ్బు పంపొచ్చు. కాని అదొక్కటే చాలదు. మాస్టారి మాటల్లో ప్రధానమైన దిగులు ఒకటి నాకు అర్థమైంది. చలపతి ఖాళీగా వున్నాడు. అతనికి ఒక వృత్తి, వ్యాపకం కావాలి. మాస్టారి తదనంతరం, చలపతి ఆ ఆధారంతో తన సంసారం గడుపుకోగలడన్న ధైర్యం మాస్టారికి కావాలి. సమస్య అర్థమైతే పరిష్కారం తేలిక. చలపతిని నాకూడా బైటికి తీసికెళ్ళాను. శివాలయంలో కూర్చుని తాపీగా మాట్లాడాను. ఉన్న పరిస్థితికి చలపతీ బాధ పడుతున్నాడు. కష్టపడి ఏ పని చెయ్యటానికేనా సిద్ధంగా వున్నాడు.
మాస్టారి ఇంటి ముందు మెయిన్ రోడ్డుకి ఆనుకొని, ఆయనదే విశాలమైన స్థలం వుంది.

వరసగా ఆరు షాపులు ఆ స్థలంలో కట్టేటట్టు ప్లాన్ వేయించాను. అవసరం అయిన డబ్బు ఇచ్చాను. ఆ మెయిన్ రోడ్ బాగా అభివృద్ధి చెందింది. ఆరు షాపులు తయారై, ఆ అద్దె వాళ్ళకి ప్రతి నెలా వస్తే మాస్టారికి ఇబ్బంది వుండదు. ఆ ఏర్పాట్లన్నీ చేసి, నేను తిరిగి ప్రయాణమయ్యాను. మాస్టార్ని అతి బలవంతం చేస్తేనే గాని వీటికి ఒప్పుకోలేదు. ‘నా జీవితం మొత్తాన్ని తీర్చిదిద్దారు. నేను ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేనని’ చాలా రకాలుగా బతిమాలాను. “పిల్లలకి చదువే కాదు కిరణ్ మంచి జీవితం గురించి కూడా చెప్పటం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత. నేను చేసింది అదే. నీకు అదనంగా చేసిందేం లేదు” అన్నారు మాస్టారు. ఉపాధ్యాయుడిగానే కాక, మార్గదర్శిగా, తండ్రి కాని తండ్రిగా నన్ను ఆయన చూసినప్పుడు, కొడుకు గాని కొడుకులా నా బాధ్యత నేనూ ఇలా నిలబెట్టుకోటం నా కర్తవ్యమే అనిపించింది. నేను వెనక్కి అమెరికా చేరింతర్వాత, తరచుగా మాస్టారితో, చలపతితో సెల్‌లో మాట్లాడుతూనే వున్నాను.
కొట్లు కట్టడం పూర్తయింది. ఇంటి రిపేర్లూ అయ్యాయి. చలపతి అయిదు షాపులు అద్దెకిచ్చాడు. ఒక షాప్‌లోప్రొవిజన్ స్టోర్స్ పెట్టి తనే ఆ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేని స్థాయికి మాస్టారి కుటుంబం చేరింది. నాకు కలిగిన తృప్తి అంతా, ఇంతా కాదు. చలపతి పదే పదే తన సంతోషాన్ని, తృప్తిని నాతో పంచుకొన్నాడు. “నాన్నకి మనశ్శాంతిని కలిగించిన కొడుగ్గా, ఇప్పుడు నాకెంతో బాగుంది. దీనికంతా మీ సహాయమే కారణం. నేను ఏం మాట్లాడా ఏం అనుకోవాలో, నాకు తోచటం లేదు” అన్నాడు చలపతి ఫోన్‌లో. “ఏం అనుకోవద్దు. నీతో పాటు, మీ అన్నలాగ, నాకూ మాస్టారి సంతోషం, మనశ్శాంతి సమానమే అని భావించు” అన్నాను నిండు మనస్సుతో. అన్ని ఆర్థిక ఇబ్బందులూ, కష్టాలూ ఎదురైనా మాస్టారు కృంగిపోలేదు. అంత పెద్ద వయసులోనూ బాధ్యత తప్పించుకోలేదు. జీవితం అంటేనే… కష్టం, సుఖం అన్నట్టే వున్నారు. కాని దిగులు పడ్డారు. ఆ దిగులు తీరటానికి నేను ఉపయోగపట్టం నా అదృష్టం. చేసిన సాయం ఒక కుటుంబానికి మంచి జీవితం ఇవ్వటం ఆనందం కదా!

వి. రాజారామ మోహనరావు
9394738805

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News