Thursday, November 21, 2024

నిరుపేదలకూ నికార్సైన వైద్యం

- Advertisement -
- Advertisement -

ఐటి రంగంలో బెంగళూరు తర్వాత ద్వితీయ స్థానాన్ని అందిపుచ్చుకున్న భాగ్యనగరం, వైద్య రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. దేశంలోనే అత్యుత్తమ వైద్యసేవలు అందించే నగరాల్లో ఒకటిగా ఇప్పటికే పేరు సంపాదించుకుంది. దేశవిదేశాల నుంచి ఇక్కడకు తరలివచ్చే రోగులే ఇందుకు నిదర్శనం. వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న వినూత్నమైన మార్పులను అవగాహన చేసుకుంటూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవపోసన పడుతూ- పుట్టలకొద్దీ పుట్టుకొస్తున్న కొత్తరకం వ్యాధులను అరికట్టేందుకు ఇక్కడి వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో వైద్యపరంగా రెండు వినూత్నమైన పరిణామాలకు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారడం హర్షించదగిన విషయం. ఇందులో ఒకటి ఇకపై శస్త్రచికిత్స ద్వారా చేతుల మార్పిడి కూడా సాధ్యమేనంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు ముందుకు రావడం. రెండవది- జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తున్న హెచ్. పైలోరి అనే బ్యాక్టీరియాపై విస్తృత పరిశోధనలు సాగించేందుకు వీలుగా ఓ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఎఐజి) ఆస్పత్రి యాజమాన్యం పూనుకోవడం. బ్రెయిన్ డెడ్ అయిన రోగులనుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి అవయవాలను సేకరించి, వాటిని బతికున్న రోగులకు అమర్చడమే తప్ప, వైద్యపరంగా చేతుల మార్పిడి ప్రక్రియ అసాధ్యమని అందరూ భావిస్తున్న తరుణంలో అపోలో వైద్యులు ఇది సులభసాధ్యమేనని భరోసా ఇవ్వడం వైద్యరంగంలో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

ముక్కలుగా తెగిపడిన చేతి భాగాలను కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అతికించవచ్చంటూ వారు చెబుతున్న మాటలు.. చేతులు లేని లేదా ప్రమాదంలో చేతులు కోల్పోయిన వేలాది మందికి భరోసా ఇస్తాయనడంలో సందేహం లేదు. అయితే బ్రెయిన్ డెడ్ అయిన రోగుల బంధువుల నుంచి సహకారం అందితే తప్ప డాక్టర్లు చేయగలిగిందేమీ ఉండదు. ఈ దిశగా ఇప్పటికే అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు విశేషమైన కృషి చేస్తున్న జీవన్ దాన్ వంటి సంస్థలు ఇకపై చేతుల దానానికీ నడుం బిగించవలసి ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయినవారి చేతులను దానం చేస్తే, మరణానికి చేరువైన తమ బంధువుకు చేతులు లేవనే భావన కుటుంబ సభ్యులలో కలగకుండా ఉండేందుకు కృత్రిమ చేతులను అమర్చుతామన్న అపోలో వైద్యుల హామీ ఎంతో ఉదాత్తమమైనది. ఇక రెండో విషయానికొస్తే, ఉదర సంబంధిత వ్యాధులు వస్తే చికిత్స కోసం ఆస్పత్రులకు పరుగు పెట్టడంతప్ప ఆ వ్యాధులు దేని వల్ల కలుగుతున్నాయనే అవగాహన సాధారణ ప్రజానీకానికి ఉండదు.

ఈ నేపథ్యం లో మన దేశంలో దాదాపు 50 -60 కోట్ల మంది ప్రజలు హెచ్. పైలోరీ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులబారిన పడుతున్నారంటూ నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బారీ మార్షల్ చెప్పిన మాటలు వింటే వెన్నులో వణుకు పుట్టక మానదు. అల్సర్లు, ఉదరకోశ క్యాన్సర్లకు ఈ బ్యాక్టీరియానే కారణమంటున్న ఆయన, 90 శాతం చిన్నపిల్లలకు తల్లి ద్వారానే ఈ సూక్ష్మక్రిములు సోకుతాయంటున్నారు. హెచ్- పైలోరీ బ్యాక్టీరియాపై పరిశోధనల కోసం తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్న త్యాగధనుడు డాక్టర్ మార్షల్ పేరును బ్యాక్టీరియాపై విస్తృత పరిశోధనల కోసం ఎఐజి ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన రీసెర్చి సెంటర్‌కు పెట్టడం ఎంతయినా సమంజసం. భారతదేశం నిరుపేదలకు పుట్టినిల్లు. దాదాపు 145 కోట్ల దేశ జనాభాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్యే అధికమనడంలో సందేహం లేదు. రెండు పూటలా కడుపు నింపుకోవడమే గగనంగా మారిన ఇలాంటి మోడువారిన జీవులకు పౌష్టికాహారం దొరకదు సరికదా రోగాలు రొష్టులు వస్తే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించవలసిందే తప్ప మరో దారి ఉండదు.

కాబట్టి, వైద్య రంగం లో వెలుగు చూస్తున్న సరికొత్త ఆవిష్కరణలు ఇలాంటి అభాగ్యజీవులకు అందినప్పుడే వాటికి ఫలితం ఉంటుంది. ఖరీదైన వైద్యానికి నోచుకోని పేదలకు సరికొత్త చికిత్సా విధానాలు అందాలంటే, వైద్యరంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను, ఆధునిక శస్త్ర చికిత్సా విధానాలను ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అందిపుచ్చుకోవాలి. ఇందుకు తగిన రీతిలో ఆసుపత్రులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలకు చిరునామాగా మారుతున్న భాగ్యనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు సరికొత్త వైద్య విధానాలను, చికిత్సా పద్ధతులను పేదలకు చేరువ చేయడంలో చొరవ చూపాలి. అప్పుడే వైద్యో నారాయణో హరిః అనే నానుడికి సార్థకత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News