Monday, December 23, 2024

అంగన్‌వాడీలకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్
అంగన్‌వాడీ సిబ్బందికి ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సు నిర్దేశన
ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం
అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్

మన తెలంగాణ/ హైదరాబాద్:  సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్‌పై ప్రత్యేక నిబంధనలేమీ లేవు. సిఎం కెసిఆర్ విశాల దృక్పథంతో వారికి 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, లక్ష రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కల్పిచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ల పదవి విరమణ తీసుకున్న తరువాత వారికి ఆసరా పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్‌వాడీ టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు. అంగన్‌వాడీ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అంగన్‌వాడీల సమస్యల పట్ల తక్షణమే స్పందించిన సిఎం కెసిఆర్ సమస్యలను పరిష్కరిస్తూ జీవో విడుదల చేసారని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు ఆత్మగౌరవాన్ని కల్పించారని పేర్కొన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తూ మహిళ గర్భం దాల్చినప్పట నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లితండ్రి మాదిరిగా ఈ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదని గుర్తు చేశారు. మోదీ సర్కారు వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం ఇవ్వాల్సి ఉండగా 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సిఎం కెసిఆర్ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News