రెండు శాతం పెంచుతూ కేంద్ర
కేబినెట్ నిర్ణయం 53 నుంచి
55శాతానికి చేరిన డిఎ కేంద్రంపై
రూ.6,614కోట్ల అదనపు భారం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యాన్ని (డిఎ) 2 శాతం మేర పెంచింది. అలాగే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ ( డీఆర్) ను పెంచింది. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వం లో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వనీ వై ష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. జనవరి 1 నుంచి పెరిగిన డీఎ వర్తిస్తుంద ని తెలిపారు. డీఎ సవరణ తరువాత డీఏ మొత్తం బేసిక్ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డీఏ పెంపుతో 48.66 లక్షల మం ది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. చివరగా గత ఏడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు.
ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను సవరిస్తూ ఉంటారు. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. ఇది జనవరి, జులై నెలల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి అక్టోబరులో కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా, బకాయిలతో కలిపి జనవరి, జులై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్‌ను ప్రాతిపదికగా తీసుకోవడం పరిపాటిగా వస్తోంది. కేంద్రం డీఏను పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది. డిఏ, డీఆర్ పెంపువల్ల ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ. 6614.04 కోట్లవరకు భారం పడుతోంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపు.
ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీకి ప్రోత్సాహం
నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పిఎల్‌ఐ) పథకం కిందకు తీసుకొచ్చింది. దీనికోసం ఆరేళ్లకు గాను రూ. 22,919 కోట్లు చెల్లించనున్నట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీనివల్ల సుమారు రూ. 59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. దీంతోపాటు ప్రత్యక్షంగా 91 వేల మందికి, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు లబిస్తాయని పేర్కొన్నారు. అనేక రంగాల అవసరాలతో ముఖ్యంగా టెలికం, కన్సూమర్ ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ పరికరాలు తదితర వాటితో ఈ విభాగం ముడిపడి ఉందన్నారు. ఈ పథకం వల్ల రూ. 4.56 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు జరుగుతాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
పొటాష్, ఫాస్ఫేట్ ఎరువులకు రూ.37,216 కోట్ల సబ్సిడీ
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు ) పొటాష్, ఫాస్ఫేట్ ఎరువులకు రూ. 37,216 కోట్లు సబ్సిడీ కింద చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖరీఫ్ సీజన్ 2024 కు సంబంధించి రూ. 37,216 .15 కోట్లు బడ్జెట్ అవసరమవుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సబ్సిడీ నిధులు రూ.13,000 కోట్ల వరకు అవసరమవుతాయన్నారు. డీఎపీ (డై అమోనియం ఫాస్ఫేట్ ) రిటైల్ ధరలు ఇప్పటిలాగే ఉంటాయని చెప్పారు. ఈ ఎరువులు 28 గ్రేడుల్లో రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.