మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికై అనివార్య కారణాల వల్ల హాజరుకాలేక పోయిన 130 మంది అభ్యర్థులకు పోలీసు శాఖ శుభవార్త తెలిపింది. అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ (ట్రైనింగ్) అభిలాష బిస్త్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
వీరికి జులై 22 నుంచి శిక్షణ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి సివిల్, ఎఆర్, రాష్ట్ర విభాగాలలో ఉద్యోగాలకు అభ్యర్థులను టిఎస్‌ఎల్‌పిఆర్‌బి ఎంపిక చేసిన సంగతి విదితమే. అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభించారు. అయితే కొంతమంది అభ్యర్థులు పలు టెక్నికల్ కారణాల వల్ల శిక్షణకు హాజరు కాలేకపోయారు. అయితే జులై 22 నుంచి వీరికి శిక్షణ ప్రారంభం కానుంది. మొత్తం 9 నెలలు పాటు శిక్షణ కొనసాగనుంది. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎస్‌పిలు, కమిషనర్లను ఆమె కోరారు.
తెలంగాణలో మొత్తం 16,604 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ కాగా.. 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 5,010 పోస్టులు టిఎస్‌ఎస్‌పి కానిస్టేబుల్ పోస్టులున్నాయి. తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభమైన సంగతి విదితమే. రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టిఎస్‌ఎస్‌పి బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు.
అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టిఎస్‌ఎస్‌పి విభాగానికి చెందిన 5,010 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత వారికి శిక్షణ కొనసాగించారు. తాజాగా మిగిలిన వారికి శిక్షణకు సంబంధించిన పోలీసు నియామక బోర్డు కీలక ప్రకటన చేసింది. వివిధ కారణాలతో హాజరుకాని 130 మందికి రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆహ్వానం పంపింది. వీరంతా ఈ నెల 22 లోపు ఆయా శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కోరింది. తెలంగాణలో కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు గతేడాది మే 30న వెలువడిన సంగతి విదితమే. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను పోలీసుశాఖ వెల్లడించింది.
తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 98,218, ఎస్‌సీటీ ఎస్‌ఐ సివిల్ పోస్టులకు 43,708, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల్కు 4,564, ఎస్‌సీటీ ఎస్‌ఐ ఐటీ అండ్ సీవో పోస్టులకు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్, డైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 1,779; ఎస్‌సీటీ ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాలకు 1,153; ఎస్‌సీటీ ఎస్‌ఐ పీటీవో ఉద్యోగాలకు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టులకు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరి నుంచి 13,444 మంది కానిస్టేబుల్ శిక్షణకు పోలీసు శాఖ ఎంపిక చేసింది.