హైదరాబాద్: కరీంనగర్ నుంచి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్‌సిటిసి శుభవార్త చెప్పింది. ‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్’ పేరుతో కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వేసవిలో అధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. జూన్ 1వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీలో తిరుచానూర్, కాణిపాకం, తిరుపతి, తిరుమల, శ్రీనివాస మంగాపురం లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగనుంది.
ఐఆర్‌సిటిసి ‘సప్తగిరి ఎక్స్ కరీంనగర్’ ప్రయాణం ఇలా..
మొదటి రోజు: కరీంనగర్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. కరీంనగర్ నుంచి రాత్రి 07.15 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. పెద్దపల్లికి రాత్రి 8.05 గంటలకు చేరుకుంటుంది. వరంగల్ నుంచి రాత్రి 9.15 గంటలకు, ఖమ్మం నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
రెండో రోజు: ఉదయం 07:50 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. ఐఆర్‌సిటిసి పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శనకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. అనంతరం హోటల్‌కు తిరిగి వెళ్తారు. భోజనం తర్వాత రాత్రి తిరుపతిలో బస ఉంటుంది.
మూడో రోజు: ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ ఔట్ అవ్వాలి. అనంతరం వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఉదయం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. తిరుగు ప్రయాణంలో రాత్రి 08.15 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైలు బయలుదేరుతుంది.
నాలుగోరోజు: తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. వరంగల్‌కు 04.41 గంటలకు, పెద్దపల్లికి 05.55 గంటలకు, కరీంనగర్‌కు ఉదయం 08.40 గంటలకు చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ధర
ఈ టూర్‌లో భాగంగా కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.9,010లు, ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికీ రూ. 7,640లు, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.7,560లుగా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 7120లుగా ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ రూ. 5740, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5660లుగా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం, రైలు టికెట్లు, హోటల్లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కలిపి ఉంటాయి.