ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్‌ఎస్‌పై కీలక ప్రకటన : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్‌ఎస్‌పై కీలక ప్రకటనలుంటాయని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వీటి పట్ల సిఎం కెసిఆర్ సానుకూలంగా ఉన్నారని ఉద్యోగులు, జేఏసీ నేతలకు వెల్లడించారు. ఉద్యోగుల జేఏసీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగ సంఘాల నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ను కలిసిన సందర్భంలో పిఆర్‌సి , ఐఈఆర్ గురించి విన్నవించగా సానుకూలంగా స్పందించి, శాసనసభావేదికగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆగస్టు 15న గోల్కొండ కోటలోను ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని అన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమతలు మాట్లాడుతూ త్వరలోనే సిఎం కెసిఆర్‌ను కలిసి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉద్యోగుల సేవలను అసెంబ్లీ వేదికగా గుర్తుచేసి ఈహెచ్‌ఎస్, ఐఆర్, పీఆర్సీలపై ప్రకటించనందుకు సిఎం కెసిఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ వెన్నంటి ఉంటామని, బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా తీర్మానించారు.ఈ సమావేశంలో జేఏసి ఛైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వి.మమత, టిఎన్‌జివో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టిజిఓ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, పిఆర్‌టియూ టిఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కృష్ణాయాదవ్, వెంకట్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.