Thursday, November 21, 2024

రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, తమలాంటి ప్రభుత్వం వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటే చూపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సవాల్ విసిరారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే, అధికారంలోకి రావాలన్న బాధ ఇంకోకరిదని మంత్రి తుమ్మల ఎద్దేవా చేశారు. తాము నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తాకేది కదా అని ఆయన బిఆర్‌ఎస్, బిజెపి నాయకులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దసరా తర్వాత రూ.2 లక్షల పైబడి రుణమాఫీ ఉన్న లబ్ధిదారుల గురించి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇప్పటికీ 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామని, ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. అధికారంలోకి రావాలనుకునే వాళ్లు, అధికారం పోయిన వాళ్లకే ఎక్కువ ఆందోళన ఉందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి’ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్దారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. మోడీకి రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు.

95 అర్జీలను స్వీకరించిన మంత్రి
గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది అని మంత్రి తుమ్మల మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వని రైతుబంధును కూడా ఇచ్చామన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక కూడా ఎంఎస్పీ పెంపును కేంద్రం పట్టించుకోలేదని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి మీరు చేసిన రైతు వ్యతిరేక చర్యలు మర్చిపోయారా? అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతలవి బూటకపు మాటలని ఆయన మండిపడ్డారు. రుణమాఫీకి సంబంధించి బిఆర్‌ఎస్ నాయకులు ప్రపంచాన్ని మోసం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం దరఖాస్తుల స్వీకరణలో భాగంగా 95 అర్జీలను మంత్రి స్వీకరించారు. ఈ అర్జీల్లో భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లు, పలు సమస్యలపై వినతి పత్రాలు వచ్చాయని మంత్రి తెలిపారు. కొన్ని సమస్యలను వెంటనే కలెక్టర్‌లతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని మంత్రి బాధితులకు హామీనిచ్చారు. గాంధీభవన్‌కు వస్తే తమ సమస్యలు తీరుతాయని ప్రజలు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వం ఒక వైపు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటూనో, మరోవైపు గాంధీ భవన్‌లో మంత్రులతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషించదగ్గ విషయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువుగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు.

గ్రూప్ 4 అభ్యర్థులకు తీపి కబురు అందిస్తాం
త్వరలోనే గ్రూప్ 4 ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టుతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో గ్రూప్4 అభ్యర్థులు మంత్రిని కలిశారు. 2022 డిసెంబర్‌లో గ్రూప్4 నోటిఫికేషన్ వచ్చిందని, ఫైనల్ ఫలితాలను ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వెంటనే టిజిపిఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఫైనల్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని మంత్రి తుమ్మల చైర్మన్‌కు సూచించారు. త్వరలోనే గ్రూప్4 అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, తీపి కబురు అందిస్తుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News