ఈ ఏడాది సాధారణం కంటే అధిక
వర్షపాతం తెలంగాణ సహా
పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో
సాధారణం కన్నా తక్కువ భారత
వాతావరణ శాఖ ప్రకటన
న్యూఢిల్లీ : దేశ రైతాంగానికి సహా ప్రజలకు భా రత వాతారణ శాఖ(ఐఎండి) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది రుతుపవన కాలం ఆశాజనకంగా కనిపిస్తోందని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు మంగళవారంనాడు వెల్లడించింది. నైరుతి రుతుపవన కా లం జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీ టర్లు ఉండగా, ఈసారి 105 శాతంగా వర్షపాతం నమోదు కానుందని ఐఎండి చీఫ్ మృత్యుంజయ్ మొహాపాత్ర వెల్లడించారు. ఈ సారి ఎల్‌నినో లాం టి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నైరుతి రుతుపవనాల వల్ల తెలు గు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదువుతుందని పేర్కొంది.
అయితే 1971-2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెం.మీగా నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలతో వివరించింది.మరోవైపు ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 18 శాతం ఉన్నందున ఈ సారి ఐఎండి రైతులకు శుభవార్త చెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. రాబోయే నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు , పలు అంశాలను విశ్లేషించిన తరువాత ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మిమీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని పేర్కొంది. పశ్చిమ, దక్షిణ భారత దేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.