Saturday, December 21, 2024

హెచ్1 బి వీసా దారులకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : హెచ్1బి వీసాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్1 బి వీసా పునరుద్ధరణ ( రెన్యువల్) కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొన్ని కేటగిరీలకు చెందిన హెచ్1 బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్ చేసుకునేలా ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్టును డిసెంబర్‌లో ప్రారంభించనున్నంది. ఈ వివరాలను వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ స్టఫ్ట్ వెల్లడించారు. దీని ప్రకారం తొలుత 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నారు. మూడు నెలల పాటు ఈ పైలట్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని జూలీ తెలిపారు.
భారతీయుల నుంచే అమెరికా వీసాలకు ఎక్కువ డిమాండ్ ఉందని,

అందువల్ల వారికి వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని జూలీస్టఫ్ తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్ 1 బీ వీసాదారులు, వారి సొంత దేశాలకు వెళ్లకుండానే నేరుగా యూఎస్‌లో ఉండే వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. వీరిలో మెజారిటీ భాగం భారత దేశానికి చెందిన వారే ఉంటారని జూలీ పేర్కొన్నారు. దీనివల్ల భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై పనిభారం తగ్గి, కొత్త దరఖాస్తుదారులపై దృష్టి పెట్టవచ్చని ఆమె వెల్లడించారు. ఈ వీసా రెన్యువల్ ప్రోగ్రామ్‌కు ఎవరెవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామని చెప్పారు.

1.40 లక్షల స్టూడెంట్ వీసాలు జారీ
అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లే వారిలో భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గత ఏడాది రికార్డు స్థాయిలో 1,40,000 మందికి పైగా అమెరికా విద్యార్థి వీసాలు జారీ చేసినట్టు జూలీ వెల్లడించారు. ఈ ఏడాదిలో ఈ సంఖ్య మరింత పెరగనున్నట్టు చెప్పారు. ఇక భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ సమయాన్ని కూడా తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఏటా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65 వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.

వీటితోపాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్‌టిఇఎం) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేలు వీసాలు ఇస్తారు. అంటే మొత్తం 85 వేల హెచ్1 బీ వీసాలన్న మాట. హెచ్ 1 బీ వీసా కలిగిన వారు తమ వీసా రెన్యువల్ , స్టాంపింగ్ సేవల కోసం వారి స్వంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాల్లో ఈ సేవలు లభిస్తాయి. అయితే ఇందుకోసం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేంది. ఈ ఇబ్బందులను పరిగణన లోకి తీసుకున్న అమెరికా ప్రభుత్వం ఇలాంటి వారికి ఊరట కలిగేలా తాజా నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో పర్యటించారు. ఆ సమయం లోనే దీనిపై చర్చ జరిగింది.
ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ప్రకటించారు. రోనాల్డ్ రీగల్ సెంటర్‌లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయం లోనే ఈ ప్రకటన వెలువడింది. దాదాపు 20 ఏళ్లుగా ఇలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఇప్పుడు అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ వర్కింగ్ వీసాల కోసం భారత్‌కు వెళ్లాల్సిన వారికి ఇది లబ్ధి చేకూర్చనుంది.
భారతీయ అమెరికన్ అజయ్‌జైన్ హర్షం
భారతీయ సంతతి అమెరికా సమాజ నేత అజయ్ జైన్ భుటోరియా ఈ నిర్ణయం చెప్పుకోదగినదిగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ఆసియన్ అమెరికన్స్ అడ్వయిజరీ కమిషన్ తరఫున కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. తాను చేసిన ఈ ప్రతిపాదనకు అధ్యక్షుడు బైడెన్ అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News