Thursday, December 19, 2024

భారతీయులకు బైడెన్ శుభవార్త

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే యువతకు బైడెన్ కార్యవర్గం ఓ శుభవార్త చెప్పింది. మరింత తేలికగా ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకొనేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతోపాటు సులువుగా ఎఫ్1 విద్యార్థి వీసాలను హెచ్1 బీ వీసాలుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. హెచ్1బీ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరి లోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకొంటుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి లబ్ధి పొందాయి. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం నాన్‌ప్రాఫిట్, ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనం, నిబంధనల్లో మార్పులు చేసింది.

దీని ప్రకారం సంస్థలు అవసరాలకు తగినట్టు నియామకాలు చేసుకొని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు. వచ్చే నెల ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో బైడెన్ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎఫ్1 విద్యార్థి వీసాలను తేలిగ్గా హెచ్1 బీ వీసాలుగా మార్చుకొనే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు ఎఫ్1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్లైంది. దీంతోపాటు గతం లోనే హెచ్1 బీ వీసా పొందినవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. అమెరికా లోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చేందుకు బైడెన్‌ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక కొత్త విధానంలో లేబర్ కండీషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్1 బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. ఇక ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలుకానున్నాయి. అమెరికాలో ఏటా 65 వేల హెచ్1 బీ వీసాలకు అనుమతిస్తుంది.

అదనంగా మరో 20 వేల అడ్వాన్స్ డిగ్రీ వీసాలను కూడా జారీ చేస్తుంది. కానీ చాలా నాన్‌ప్రాఫిట్ సంస్థలు దీని నుంచి మినహాయింపులు ఉన్నాయి. కొత్త నిబంధనల కింద ఈ సంస్థలు తమ పనిని ‘పరిశోధన’గా పేర్కొనాల్సి ఉంటుంది. “ అత్యంత నాణ్యమైన వృత్తి నిపుణులను నియమించుకొనేందుకు అమెరికా వ్యాపార సంస్థలు హెచ్1 బీ వీసాలపై ఆధారపడ్డాయి. తాజా మార్పులతో యజమానులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభా వంతులను నియమించుకొనేందుకు మరింత సౌలభ్యం లభిస్తుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థలో పోటీ తత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అమెరికా సృజనాత్మకతను మరింత పెంచుతుంది” అని హ్యోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ఎన్ మేయోర్కాస్ పేర్కొన్నారు. ఇక అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జడ్డూ స్పందిస్తూ “ 1990 లో అమెరికా కాంగ్రెస్ హెచ్1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాలానుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం ఉండేలా దానిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News