ఆన్‌లైన్ సేవల బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఆన్‌లైన్‌లో వాకర్స్, విజిటర్స్ పాసులు
ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అటవీ అభివృద్ధి సంస్థకు రూ. 87.75లక్షల హెచ్‌డిఎఫ్‌సి విరాళం
హైదరాబాద్ : కొత్తగూడ కెవిబిఆర్ బొటానికల్ పార్క్ వాకర్స్ వార్షిక, నెలవారీ పాసుల రెన్యువల్, కొత్త పాసులకు దరఖాస్తు, సందర్శకుల ప్రవేశ టికెట్‌ల ఆన్‌లైన్ సేవలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం బొటానికల్ గార్డెన్ వెబ్ సైట్‌ను ఆవిష్కరించి, ఆన్‌లైన్ సేవలను మంత్రి ప్రారంభించారు. అనంతరం బొటానికల్ గార్డెన్ థీమ్ పార్క్ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్)లో భాగంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇచ్చిన రూ. 87.75 లక్షల చెక్ ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అందజేశారు. చిలుకూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కల పెంపకానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంపకానికి విరాళం ఇచ్చిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, పిసిసిఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్, పిసిసిఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు