మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని నెలవారీ బస్‌పాస్ దారులకు టిఎస్ ఆర్టీసి శుభవార్త చెప్పింది. బస్‌పాస్‌తో పాటు టోల్ ప్లాజా రుసుం వసూలు చేయనుంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లను మంజూరు చేయాలని టిఎస్ ఆర్టీసి నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది. ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్ దారులకు టోల్ ప్లాజా రుసుంను వేరుగా ఆర్టీసి వసూలు చేస్తోంది.
బస్ పాస్ చూపించి ప్రతి రోజూ వారు టోల్ ప్లాజా వద్ద టికెట్ తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఈ విధానాన్ని ఆర్టీసి ఎత్తివేసింది. ఇక టోల్ రుసుంతో పాటే నెలవారీ బస్‌పాసులను మంజూరు చేయాలని తాజాగా ఆర్టీసి నిర్ణయించింది. రాష్ట్రంలో 15వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లు ఉండగా 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి ‘మంత్లీ సీజన్ టికెట్’ పేరుతో పాసులను ఆర్టీసి జారీ చేస్తోంది. ఈ పాస్ తీసుకుంటే సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీని ఆర్టీసి అందిస్తోంది. 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసి కల్పిస్తోంది.