మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుమలకు టిఎస్ ఆర్టీసి బస్సులో వెళ్లే ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. రూ.300ల ప్రత్యేక దర్శనం, రెండు రోజుల ముందు బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రయాణికుల కోసం టిటిడి ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, విసి అండ్ ఎండి సజ్జనార్, ఐపిఎస్‌లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టిఎస్ ఆర్టీసి ప్రయాణికుల సౌకర్యార్థం స్వామి వారి టిక్కెట్లను మంజూరు చేయడం హర్షణీ యమని, భక్తులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని ఆర్టీసి చైర్మన్, వైస్ చైర్మన్‌లు పేర్కొన్నారు.
టిఎస్ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమని, కుటుంబసమేతంగా స్వామిని హాయిగా దర్శించుకోవచ్చని వారు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు రోజువారీగా 1,000 టిక్కెట్లను జారీ చేయనుందని వారు పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ కింద టిఎస్ ఆర్టీసి బస్సులో ప్రయాణించాలనుకునే వారు రెండురోజుల ముందు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. తక్షణం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను జారీ చేయడానికి టిటిడి సైతం అనుమతి ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ వల్ల టిఎస్ ఆర్టీసికి మరింత ఆదరణ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీని వినియోగించుకోవాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా సర్టిఫికేట్ లేదా దర్శనానికి 72 గంటలలోపు పొందిన కోవిడ్ -19 నెగిటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని వారు తెలిపారు.