Monday, December 23, 2024

తిరుపతి- సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ టు- తిరుపతి, తిరుపతి -టు సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇక నుంచి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కాకుండా రిజర్వేషన్ చేసుకున్న ప్రతిఒక్కరికీ టికెట్ దొరికేలా వందేభారత్ రైళ్లకు అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా సికింద్రాబాద్ టు- తిరుపతి -టు సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైళ్లకు అదనంగా మరో 8 కోచ్‌లను ఏర్పాటు చేసి మొత్తం 16 కోచ్‌లతో ఈనెల 17వ తేదీ నుంచి ప్రయాణికులకు సేవలను అందించాలని దక్షిణమధ్య రైల్వే భావించింది. దీంతో 1,128 సీట్ల సామర్థంతో ప్రయాణికులకు సేవలందించడానికి సమాయత్తం అవుతోందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

రైలు నం. 20701/02 సికింద్రాబాద్ -టు తిరుపతి -టు సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో 8 కోచ్‌లతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. సాధారణ సేవలను ప్రవేశపెట్టినప్పటి నుంచి, రైలు 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తోంది. రైలు నంబర్ 20701 సికింద్రాబాద్ టు- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో 131 శాతం, మే 2023లో 135 శాతం, రైలు నంబర్ 20702 తిరుపతి టు- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో 136 శాతం, మే 2023లో 138 శాతం ఆక్యుఫెన్సీని నమోదు చేసింది.
ఇప్పటివరకు 44,992 మంది ప్రయాణికుల చేరవేత
ప్రయాణికుల సంఖ్యా పరంగా మే 15వ తేదీ (సోమవారం) వరకు, మొత్తం 44,992 మంది ప్రయాణికులు వందే భారత్ రైళ్లలో ప్రయాణించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 21,798 మంది ప్రయాణికులు రాగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మరో 23,194 మంది ప్రయాణించారు. గతంలో ఉన్న 8 కోచ్ కెపాసిటీకి బదులుగా 16 కోచ్‌ల సామర్థ్యంతో ఈనెల17వ తేదీ నుంచి నడపాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. కొత్త కంపోజిషన్‌లో 1,024 కెపాసిటీతో 14 చైర్ కార్లు ఉంటాయని అధికారులు తెలిపారు.
కోచ్‌ల రెట్టింపుతో ప్రయాణికులకు లాభం: జిఎం
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ కోచ్‌ల రెట్టింపుతో అధిక సంఖ్యలో రైలు ప్రయాణికులు వందే భారత్ రైలు సేవలను పొందగలుగుతారని అయన తెలిపారు. కోచ్‌లను సకాలంలో రెట్టింపు చేయడం కూడా అదనమని, ఈ వేసవి సెలవుల సీజన్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు తిరుపతికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇంకా ప్రయాణ సమయం తగ్గింపుతో రైలు ప్రయాణికుల ప్రయాణాన్ని వేగంగా, మరింత సౌకర్యవంతమైన రీతిలో అందచేయగలుగుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News