Monday, December 23, 2024

జర్నలిస్టులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం తీర్పు స్థలాల స్వాధీనానికి
అనుమతి సిజెఐకి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు

ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం పచ్చజెండా

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త తెలిపింది. ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న హైదరాబాద్ జర్నలిస్టులకు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు అందించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు సుప్రీం పచ్చజెండా ఊపింది. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసుపై చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణతో కూడిన ధర్మాసనం విచారించింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడని జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. 8 వేల నుంచి 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుకున్నట్టు తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తూ తీర్పు వెలువరించారు. వారివారి స్థలాల్లో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి తాను మాట్లాడటం లేదని, ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలని జస్టిస్ ఎన్.వి. రమణ వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, కానీ అభివృద్ధి చేయలేదని అన్నారు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని, జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి తాము అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని తెలిపారు.

సిజెఐకి ధన్యవాదాలు తెలిపిన కెటిఆర్

జర్నలిస్టులకు హైదరాబాదులో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంలో ఊరట లభించిన నేపథ్యంలో మంత్రి కెటిఆర్ స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించిన సిజెఐకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన ప్రభుత్వ హామీ నెరవేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అడ్డంకులు తొలగిపోయాయి : అల్లం

సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిలు,ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్‌తో సంబంధం లేకుండా సామాన్య జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించుకోవడానికి ఇండ్లు కేటాయించడానికి తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం జర్నలిస్టుల సంఘాల నాయకులతో అల్లం నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ప్రగతిభవన్‌లో సిఎం అనేకసార్లు చర్చించి స్థలాల కేటాయింపునకు అనుకూల నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండటం వల్ల ఇన్ని రోజులుగా ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని, ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం వల్ల చాలా రోజులుగా తీరని సమస్యకు పరిష్కారం వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపులో అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు. ఇది తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం..తర్వాత తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్టుల, ఆ తర్వాత ఏర్పడిన మీడియా అకాడమీ విజయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాత జవహార్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ స్థానంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం, మీడియా అకాడమీలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత, జర్నలిస్టు, ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్ అధ్యక్షతన కొత్త కమిటీ ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర ప్రముఖులతో కమిటీ అధ్యక్షుడు క్రాంతి చర్చలు, తరువాత అందరి సహాయ సహకారలతో, ఇన్నాళ్లకు సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం సంతోషం అని అల్లం నారాయణ అన్నారు.

యూనియన్లు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు నిర్ణయం మనందరం ఈ విజయాన్ని ఆహ్వానిద్దామని అల్లం నారాయణ పేర్కొన్నారు. డబ్బులు కట్టి 13 సంవత్సరాలు నిరీక్షిస్తున్న జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. డబ్బులు సర్దలేక, భార్య పుస్తెలు తాకట్టు పెట్టి రెండు లక్షలు కట్టిన వారి కల సకారం అయ్యే రోజు వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు, డబ్బులు కేటాయించిన ఇండ్ల స్థలాలకు ఫెన్సింగ్ వేసిన హెచ్‌ఎండిఏకు, కేసు పరిష్కారంలో సహకరించిన ఢిల్లీ జర్నలిస్టులకు, ఓపికగా పని చేసిన సెక్రెటరీ వంశీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు అనుకూలంగా రావడానికి తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల జీవన ప్రమాణాలు తెలుపుతూ ఇచ్చిన అఫిడవిట్ కీలకమైందని సొసైటీ సెక్రటరీ వంశీ అన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ మారుతి సాగర్, జర్నలిస్ట్ నాయకులు బసవ పున్నయ్య, యోగానంద్, నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News