Monday, December 23, 2024

టిఎస్‌ఆర్‌టిసి టి9 టికెట్ ప్రయాణికులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : టిఎస్‌ఆర్‌టిసి ఇటీవల ప్రవేశపెట్టిన టి9 టిక్కెట్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి 9 టికెట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టి 9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టిఎస్‌ఆర్‌టిసి ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది.

ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుందని నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ తెలిపారు. టి9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టిఎస్‌ఆర్‌టిసి కల్పించిందన్నారు. రూ. 100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ. 20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని తెలిపారు.

తిరుగు ప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 20 కాంబీ టికెట్ వర్తిస్తుందన్నారు. టి9 టికెట్ సవరణ సమయాలు రూ. 20 కాంబీ టికెట్ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం టి9 టికెట్‌ను ప్రవేశపెట్టిందని, ఈ టికెట్‌తో రూ.100 చెల్లించి 60 కి.మీ పరిధిలో ఒక్కసారి రానుపోను ప్రయాణం చేయవచ్చునని, మంగళవారం ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన టిఎస్ 31 టి 0555 కండక్టర్ విఎస్ గౌడ్ 152698 సర్వీస్ నెంబర్ కండక్టర్ మహబూబ్‌నగర్ నుంచి నాగర్‌కర్నూల్‌కు ప్రయాణించే మహిళ, 50పై బడిన ఉద్యోగులకు టి 9 టికెట్ గురించి వివరించి వంద రూపాయల టికెట్‌ను అందజేశారు.

100 రూపాయలతో వీరు నాగర్‌కర్నూల్ నూతన కలెక్టరేట్ వరకు కలెక్టరేట్ నుంచి మళ్లీ మహబూబ్‌నగర్ వరకు ప్రయాణించవచ్చు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ బస్సులో 10 మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని కండక్టర్ విఎస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా చరవాణిలో ప్రయాణికులతో మాట్లాడిన నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ ప్రయాణికుల స్పందనను తెలుసుకున్నారు. ఉదయం 9 గంటలకు మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి నేరుగా నాగర్‌కర్నూల్ నూతన కలెక్టరేట్ వరకు టి9 టికెట్‌పై ప్రయాణించేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు, 58 పై బడిన ఉద్యోగస్తులకు ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆర్టిసి తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News