ఈ నెలలోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు. ఇతర కార్పొరేషన్ రంగాల్లో పోటీ పరీక్షలు నిర్వహించి ఖాళీలు భర్తీ చేస్తున్నామని, పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనేదే తమ ప్రభుత్వ ఆరాటమని అన్నారు. రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో 39వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలుగు విద్యార్థుల చిత్ర లేఖనం చూశామని వారి నైపుణ్యం అమెరికా, మలేషియాలో కూడా కనిపిస్తుందన్నారు.
ఓ పక్కన గత డిసెంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో విశ్వ విద్యాలయం స్థాపించబడిందని మంత్రి తెలిపారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. 100 కంప్యూటర్లు అతి త్వరలో కేటాయిస్తామని, ఆర్టి ఫిషియల్ రంగంలో యువ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు పోవాలని సూచించారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి కోటి రూపాయలు చెక్కును అందించిన పద్మ భూషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేశ విదేశాలలో తెలుగు భాష, సాహిత్యం, లలితకళల ఔన్నత్యాన్ని చాటుతున్న తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుందని మంత్రి అభినందించారు. తెలుగు భాషా, సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రతియేటా వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఆయా రంగాలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట పురస్కారాన్ని అందజేస్తుందని అన్నారు.
సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలనందిస్తున్న శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ డా.కె.ఐ.వరప్రసాద్ రెడ్డి 2023కి గాను లక్ష రూపాయల నగదు, ప్రశంసపత్రంతో పాటు విశిష్ఠ పురస్కారాన్ని మంత్రి శ్రీధర్ ప్రదానం చేశారు. ఐటీ, ఫార్మా, సేవారంగాలలో ఉపాధి ఉన్నప్పటికినీ లలితకళా రంగాలలో కూడా ఉపాధిని పొందే విధంగా తెలుగు విశ్వవిద్యాలయం గొప్ప నైపుణ్య శిక్షణా కేంద్రంగా నిలిచినందుకు సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తున్న విశిష్ట పురస్కారాన్ని పొందిన వరప్రసాద రెడ్డి వ్యక్తి కాదు వైద్య రంగంలో అసమాన కీర్తిని పొందిన శక్తిగా నిలిచారని, పురస్కారానికే ప్రత్యేక గౌరవాన్ని ఆపాదించారని ప్రశంసించారు.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా పని చేస్తోంది
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం కేవలం రాష్ట్ర విశ్వవిద్యాలయమే కాదని, అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా పనిచేస్తూ అమెరికా, మలేషియా, మారిషస్ తదితర దేశాలలో తమ అనుబంధ సంస్థలు తెలుగు భాషా సాహిత్య వికాసానికై అవిరళ కృషి చేస్తున్నదని గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించడానికి ప్రభుత్వ సహకారంతో భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటుందన్నారు. పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా. కె.ఐ.వరప్రసాద రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి తెలుగువారికి బలం, అస్తిత్వం అని వాటిని సమాజంలో కాపాడుకోవడానికి,
అవి మరింత పరిఢవిల్లడానికి తెలుగు విశ్వవిద్యాలయం అవసరమని అందుకు ప్రభుత్వ సహకారం వాంఛనీయమని వరప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తొలుత విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు అతిథులకు స్వాగతం పలుకుతూ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను, తెలుగు భాష, సాహిత్యాల ఔన్నత్యాన్ని, వాటి ప్రాభవాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్, గౌతంపొట్రు , అడిషనల్ కలెక్టర్ రాధిక , నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఎం.డి. సాబేర్ అలీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.