Sunday, December 22, 2024

ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు బాధితులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఇళ్లు, భూములు కోల్పోయి నిరాశ్రయులైన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన బాధితులు సోమవారం నూతన సచివాలయంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ సమస్య పరిష్కరించాలని విన్నవించారు. భూ సేకరణ చట్టం ప్రకారం భూమి హక్కు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇళ్ళ నిర్మాణానికి నిధులు రాలేదని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పలు మార్లు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప తమకు న్యాయం జరగలేదన్నారు. గతంలోనూ ఇదే విషయం పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కోసం 2009లోనే 135 ఇళ్లకు పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించారని, అయినా తమకు చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వ స్పెషల్ సెక్రటరి రజత్ కుమార్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఛాంబర్‌లోనే నిర్వాసితుల ఆవేదనను స్వయంగా వెల్లడించారు. గతంలో పైరవీకారుల మాటలను గ్రామస్థులు నమ్మటంతోనే ఇంతకాలం జాప్యం జరిగిందనిమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పక్షపాతి అని ప్రజా సంక్షేమమే ధేయంగా పనిచేస్తున్నారని మంత్రి చెప్పారు. చెగ్యాం బాధితుల సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని హామినిచ్చారు. ఇప్పటికైనా గ్రామస్థులు అంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వంతో కలిసి నడువాలని సూచించారు.

18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల భూమికి సంబంధించి పరిహారం చెల్లించడంతో పాటు ఆవాజ్ భూమి కింద ప్రభుత్వ భూమికి నిధులు ఇవ్వాలని బాధితులు కోరారు. పాత దేవాలయాలను పునర్నిర్మించాలని కోరారు. చెగ్యాం గ్రామ నిర్వాసితుల సమస్యలు విన్న ప్రభుత్వ స్పెషల్ సెక్రటరి రజత్ కుమార్ వారం, పది రోజుల్లో విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. గ్రామస్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News