విజయవంతంగా కొనసాగుతున్న టీకా పంపిణీ
మరే రాష్ట్రంలో లేని విధంగా హైరిస్క్ గ్రూప్‌లకు ప్రాధాన్యం
వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్లాన్ సక్సెస్ అవుతోంది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో వైద్యశాఖ తీసుకున్న నిర్ణయాలకు సత్ఫలితాలు వస్తున్నాయి. కరోనా వ్యాప్తి అడ్డుకట్టతో పాటు వ్యాక్సినేషన్‌లోనూ మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతుంది. ముఖ్యంగా మన దగ్గర నిర్వహిస్తున్నట్లు మరేరాష్ట్రంలోనూ వ్యాక్సిన్ పంపిణీ జరగడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కేటాయించే డోసుల సరఫరాను బట్టి ప్రాధాన్యతల వారీగా టీకాలు పంపిణీ చేస్తున్నారు.హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్, వృద్ధులు, కో మార్పిడ్, హైరిస్క్ గ్రూప్స్, సూపర్ స్ప్రెడర్లు, మహిళా సంఘాలు, టీచర్లు,18 ఏళ్ల పై బడిన సెక్టార్, గర్భిణులు ఇలా విభాగాలను విభజించి వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తికి వేగంగా అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు అంటున్నారు. డోసుల ఉత్పత్తి తక్కువగా ఉండటం వలనే వ్యాక్సిన్ పంపిణీలో అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని వైద్యశాఖ వివరిస్తుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఒక్క డోసు తీసుకున్న కొంత వరకు రక్షణ ఉంటుందని వివిధ అధ్యయనాలు వెల్లడించడంతో వైద్యశాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి మొదటి డోసు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరిగే వాళ్లకి వ్యాక్సిన్ ఇవ్వడం వలన వైరస్ కట్టడి సులువుగా మారుతుంది. ఈ మేరకు మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే గడిచిన నెలరోజుల్లో 18 ఏళ్లు నిండిన వారికి ఏకంగా 52 లక్షల మందికి పైగా టీకాలు అందించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వీరి నుంచి ఆయా కుటుంబ సభ్యులు, దీర్ఘకాలిక రోగులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
కట్టడిలో టీకాదే కీలక పాత్ర…
కరోనా కట్టడిలో టీకానే కీలక పాత్ర పోషిస్తోందని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. టీకా పొందిన వారిలో సుమారు 80 మందికి వైరస్ సోకడం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న మరో 20 శాతం మందిలో సోకినప్పటికీ తీవ్ర లక్షణాలు కనిపించటం లేదని లాన్‌సెట్‌తో పాటు వివిధ సైన్స్ జర్నల్స్ ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క డోస్ టీకా అయినా పూర్తి చేసే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మొదటి డోస్ కొవిషీల్డ్ తీసుకున్న వారికి 12 నుంచి 16 వారాల వ్యవధిలో రెండో డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కానీ ఎక్కువ మందికి మొదటి డోసు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 14 నుంచి 16 వారాల వ్యవధిలో మాత్రమే రెండో డోస్ టీకా ఇస్తామని వైద్యశాఖ తెలిపింది. కొవాగ్జిన్ తీసుకున్న వారికి మాత్రం యథాతథంగా 28 రోజుల వ్యవధి ముగిసిన తర్వాతే రెండో డోస్ టీకా ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో 2.2 కోట్ల మంది అర్హులు…
తెలంగాణలో మొత్తం 2.2 కోట్ల మంది కొవిడ్ టీకా తీసుకునేందుకు అర్హులుగా గుర్తించిన సర్కారు వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ అందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 99,38,528 మందికి మొదటి డోసు ఇవ్వగా, వీరిలో 16,91,842 మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.ఒక్క జూన్ నెలలోనే ఏకంగా 52,71,548 టీకాలు పంపిణీ చేశారంటే వ్యాక్సినేషన్ ఎలా వేగవంతం అవుతుందని అర్ధం చేసుకోవచ్చు. జూన్ నెల నుంచి ప్రతి రోజూ సగటున లక్షా 50 వేలకు తగ్గకుండా టీకా పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో కలిపి సుమారు 1169 లకు పైగా కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్ టీకాలు అందుబాటులో ఉండగా, ప్రైవేటులో స్పుత్నిక్-వి సైతం అందిస్తున్నారు. ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఉచితంగా టీకాలు అందిస్తుండగా, ప్రైవేట్‌లో కేంద్రం నిర్ణయించిన ధరలు చెల్లించి టీకాలు పొందుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ అర్బన్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వ్యాక్సినేషన్ స్పీడ్‌గా జరుగుతుంటే, ఆదిలాబాద్, వనపర్తి, ములుగు, గద్వాల్, ఆసిఫాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా కొనసాగుతుంది.
హైరిస్క్ గ్రూప్ ఎంపిక విధానంలో మరేక్కడా పంపిణీ జరగడం లేదుః వ్యాక్సినేషన్ ఆఫీసర్ డా జి శ్రీనివాసరావు
హైరిస్క్ గ్రూప్‌లను ఎంపిక చేసి టీకా పంపిణీ చేసే విధానం మరేరాష్ట్రంలో లేదు. మన దగ్గర ఈ విధానంతో వైరస్ వ్యాప్తిని సులువుగా అడ్డుకోవచ్చు. టీకాలు ఉత్పత్తి తక్కువగా ఉండటం వలనే ప్రాధాన్యత క్రమంలో టీకాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోసు విజయవంతంగా నడుస్తుంది. ఈ నెలలో ఏకంగా 25 లక్షలకు పైగా సెకండ్ డోసుకు అర్హులున్నారు. వారందరికీ స్పెషల్ డ్రైవ్స్ ద్వారా టీకా పంపిణీ చేస్తాం.అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
5.7.2021 వరకు టీకా పొందిన వారి వివరాలు…
కేటగిరీ మొదటిడోసు రెండోడోసు
హెల్త్‌కేర్‌వర్కర్లు 3,00,798 2,10,965
ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 3,10,968 1,39,423
18–44 43,70,310 1,02,344
45పైబడినగ్రూపు 50,94,507 12,99,262
మొత్తం 1,00,76,583 17,51,994