Friday, January 3, 2025

కాలం చెల్లిన కోర్సులకు మంగళం… ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం…
ఉన్నత ప్రమాణాలతో ఐటిఐలు
టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో
సిఎం రేవంత్ రెడ్డి సమావేశం
రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో
స్కిల్ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటిఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు.

తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర పభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా సాంకేతిక కోర్సులను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగ, ఉపాధి, సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో పాల్గొన్న టాటా సంస్థ ప్రతినిధులకు, అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా ఆధునాతన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని వెల్లడించారు.

రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐ.టీ.ఐలలో రూ. 1500 నుండి రెండు వేల కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులు శిక్షణ పొంది పలు పరిశ్రమలో ఉద్యోగాలు పొందే విధంగా తగిన శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడం పట్ల సిఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. టాటా సంస్థతో తమ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నదని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను కావాల్సిన ఎంఒయును కుదుర్చుకోవడానికి గాను ఉన్నతాధికారులచే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సిఎం సిఎస్‌ను కోరారు.
యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సి.ఎన్.సి మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో తగు నైపుణ్యాన్ని ప్రభుత్వ ఐటీఐలలో అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా సి.ఎం ఇందుకు అంగీకరించారు.

ఐదేళ్ల పాటు ఉచితంగా శిక్షణ అందించనున్న టాటా సంస్థ
4.0 పరిశ్రమ కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్‌వేర్ అందించడంతో పాటు ప్రతీ ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా అందించనుంది. దీనిలో భాగంగా ఆధునిక సాంకేతిక వర్క్ షాపులు, అత్యధిక డిమాండ్ కలిగిన తయారీ రంగంలో ఉపాధి కల్పించడానికి 22 నూతన స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్ట్‌లో టాటా సంస్థ అందిస్తుంది. ఇప్పటికే, ఎం.ఒ.యు విధివిధానాలు ఖరారు చేయడానికి రాష్ట్ర ఉపాధికల్పన, కార్మిక శాఖ టాటా టెక్నాలజీతో సంప్రదింపులు జరుపుతోంది. దీని ఆధారంగానే రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కార్మిక, ఉపాధికల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐ.టి , పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం, సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి, షానవాజ్, అజిత్ రెడ్డిలతో టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రసిడెంట్ పీ.వీ.కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ వైస్ ప్రసిడెంట్ సుశీల్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News