Sunday, December 22, 2024

అణు ఒప్పందానికి గుడ్ బై

- Advertisement -
- Advertisement -

మాస్కో: అమెరికాతో కుదిరిన కీలక అణ్వాయుధాల నూతన ఒప్పందంలో తమ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా అమెరికాతో రష్యాకు ఉద్రిక్తత లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యూహాత్మక ఆయుధాల ఒప్పందం (స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ ఎస్‌టిఎఆర్‌టి)లో పాలుపంచుకోవడాన్ని రద్దు చేసుకుంటున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా ఈ విధంగా వ్యవహరించినట్టయితే అణ్వాయుధాల వినియోగాన్ని రష్యా తిరిగి ప్రారంభిస్తుందని హెచ్చరించారు. ఈ చర్య అణ్వాయుధాల పరీక్షలపై ప్రపంచ దేశాల్లో ఉన్న ఆంక్షలకు ముగింపు పలుకుతుంది. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా ఓటమే తమ లక్షంగా బహిరంగంగా ప్రకటించాయ ని గుర్తు చేశారు. అవి వ్యూహాత్మక ఓటమిని కలిగించడానికి యత్నిస్తున్నాయని, తమ అణ్వాయుధాలను పొందడానికి చూస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు.

ఈ ఒప్పందం కింద రష్యా అణ్వాయుధాలను తిరిగి పరీక్షించడానికి అమెరికా ముందుకు తోస్తోందని ఆరోపించారు. రష్యా అణ్వాయుధ సామర్థ బాంబుల ప్రయోగాన్ని అడ్డుకోడానికి రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు నిర్వహించేలా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. నాటో నైపుణ్య అత్యంత ఆధునికమైన డ్రోన్లు వినియోగించినట్టు వివరించారు. ప్రస్తుత సంఘర్షణ పరిస్థితుల్లో వారు మా రక్షణ సౌకర్యాలను ఎలా తనిఖీ చేస్తారు ? ఇదంతా పూర్తిగా అసంబద్ధమైనదని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలో తమ జోక్యాన్ని విరమించుకుటున్నాం తప్ప పూర్తిగా వైదొలగలేదని వివరించారు. ఈ కొత్త ఒప్పందం 2010 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, అప్పటి రష్యా అధ్యక్షుడు డిమిట్రీ మెడ్వెదేవ్ మధ్య కుదిరింది.

1550 అణ్వాయుధాలు, 700 క్షిపణులు, బాంబర్లు మించి వీటిని పెంచుకోరాదని రెండు దేశాలు పరిమితి విధించుకున్నాయి. ఈ ఒప్పందాన్ని పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలపై విస్తృత చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం గడువు 2021 ఫిబ్రవరిలో ముగిసే సమయానికి కొద్ది రోజుల ముందు రష్యా, అమెరికా దేశాలు మరో ఐదేళ్ల పాటు ఈ ఒప్పందాన్ని పొడిగించుకోడానికి అంగీకరించాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన దగ్గర నుంచి కొత్త ఒప్పందం కింద పరస్పర తనిఖీలను రెండు దేశాలు రద్దు చేసుకున్నాయి. కానీ ఒప్పందం భవిష్యత్తు అనిశ్చితిగా భావించి రష్యా తిరిగి ఒప్పందాన్ని కొనసాగించడానికి తిరస్కరించింది. అలాగే ఈ ఒప్పందం కింద చర్చలు సాగించడాన్ని రష్యా నిరవధికంగా వాయిదా వేసింది.

పశ్చిమ దేశాలే రెచ్చగొడుతున్నాయి

ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలనుకున్నా, పశ్చిమదేశాలు మాత్రం సమస్యను జఠిలం చేస్తూ రెచ్చగొడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. రష్యాఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కావడం , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించిన నేపథ్యంలో ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి పుతిన్ మంగళవారం నాడు ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని ఆయన పదేపదే ఆరోపణలు చేశారు. పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని, తూర్పు దేశాలను నాశనం చేయాలన్న మోసపూరిత ఆలోచనలతో పశ్చిమ దేశాలు ఉంటున్నాయని పేర్కొన్నారు.

స్థానిక సమస్యను, పశ్చిమదేశాలు ప్రపంచ సమస్యగా మారుస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, డాన్‌బాస్ అబద్ధాలకు గుర్తులుగా మారాయన్నారు. రష్యా వస్తుందని, తమను ఆదుకుంటుందని డాన్‌బాస్ ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తోందని, డాన్‌బాస్‌పై కీవ్ కఠిన చర్యలను తిప్పి కొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. నాటో దళాన్ని పెంచుతూ పశ్చిమ దేశాలు దురుసుగా ప్రవర్తిస్తున్నాయని, వాళ్ల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని తాము రంగం లోకి దింపామన్నారు. ఉక్రెయిన్ ప్రజలు వెస్ట్రర్న్ మాస్టర్ల చేతిలో బందీలుగా మారారని, ఉక్రెయిన్ పాలకులు దేశ ప్రయోజనాలను కాపాడలేరని, విదేశీ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులు, వారి కుటుంబాలకు , ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని పుతిన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News