కొత్తచట్టానికి కేంద్రం తుది మెరుగులు వారా
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ తర్వాత … భారత్ గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్‌దిగ్గజాలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించే వార్తల కంటెంట్‌కు చెల్లింపులు చేసే కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న చట్టం అమలు లోకి వస్తే ఆల్ఫాబెట్ (గూగుల్, యూట్యూబ్ యజమాని), ట్విట్టర్, అమెజాన్, వంటి గ్లోబల్ టెక్ మేజర్‌లు భారతీయ వార్తా పత్రికలు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు తమ ఆదాయంలో వాటా చెల్లించవలసి ఉంటుంది. ఈ వార్తా కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయిన అసలైన కంటెంట్‌ని ఈ సంస్థలు ఉపయోగించడం ద్వారా వారు సంపాదిస్తుంటారు. టెక్ దిగ్గజాలు మీడియా సంస్థల నుంచి వార్తల కంటెంట్‌ను ఉంచడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ , ఆ ఆదాయాన్ని వారు సరిగ్గా పంచుకోవడం లేదనే వాస్తవం నుంచి ఈ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.
వార్తా ప్రచురణకర్తల కోసం, ఈ డిజిటల్ వార్తల మధ్యవర్తులు పారదర్శకత లేని ఆదాయ నమూనాలను కలిగి ఉన్నారని, వారి పట్ల ఎక్కువగా పక్షపాతం చూపుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు బిగ్‌టెక్‌తో టెక్నో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నప్పుడు తమ దేశీయ వార్తా పబ్లిషర్‌లకు స్థాయిని కల్పించడానికి నిర్దిష్టమైన చట్టాలను ప్రవేశ పెట్టాయి. కెనడా ఇటీవల ఒక బిల్లును ప్రవేశ పెట్టింది. ఇది గూగుల్ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి , న్యాయమైన రీతిలో రాబడి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రతిపాదించింది. ఈ ఎత్తుగడలు కేవలం మీడియా సంస్థల ప్రయోజనాల కోసమే కాక, వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.