మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ సంసిద్ధంగా ఉందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తోట చంద్రశేఖర్ గురువారం సమావేశమై పలు అంశాల మీద చర్చించారు. విద్య, ఆరోగ్యం కోసం సమగ్ర డిజిటలైజేషన్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం సిఎంతో గూ గుల్ వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో సిఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. తాజాగా టెక్నాలజీ మేజర్ గూగుల్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు, రోడ్ సేఫ్టీ తదితరాల్లో గూగుల్ కంపెనీ సాయంతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజల దైనందిన అవసరాల్లో కీలకంగా మారిన డిజిటల్ టెక్నాలజీ రానున్న రోజుల్లో పరిపాలన రంగంలో ఎంట్రీ కానుంది.