Wednesday, January 22, 2025

డిజిటల్ ఇండియాకు 10 బిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారతదేశ డిజిటలీకరణ నిధిలో ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుంది. ఈ విషయాన్ని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని పిచాయ్ కలిశారు. ఐటి , ఇంటర్నెట్ సంబంధిత రంగాల్లో తమ సంస్థ నుంచి ఇండియాకు సరైన రీతిలో సహకారం ఉంటుందని తెలిపారు. ఫిన్‌టెక్‌లో భారతదేశం ఇప్పుడు నాయకత్వ శ్రేణికి వచ్చిందనే విషయాన్ని గుర్తించి , ఈ క్రమంలో ఇండియాలో , ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న,

పెద్ద వ్యాపారసంస్థలకు ఈ దిశలో తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని పిచాయ్ తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గుజరాత్ ఫెన్సాన్స్ టెక్ సిటీ( గిఫ్ట్)లో గూగుల్‌కు చెందిన గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల సెంటర్‌ను ఆరంభించిన విషయాన్ని ప్రధాని మోడీకి వివరించారు. అమెరికాలో ప్రధాని మోడీ చారిత్రక పర్యటన దశలో ఆయనను తాను కలుసుకోవడం తనకు గర్వకారణం అన్నారు. ఇండియా డిజిటలీకరణ నిధులకు పెట్టుబడులకు తాము సిద్ధం అన్నారు.

మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
అమెజాన్ సిఇఒ ఆండీ జెస్సీ వెల్లడి
భారత ప్రధాని మోడీని ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కార్యనిర్వాహక ప్రధాన అధికారి ఆండీ జెస్సీ కలిశారు. ఇండియాలో అదనంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనితో ఇప్పటికీ ఇండియాలో ఈ సంస్థ పెట్టుబడుల విలువ 26 బిలియన్ల డాలర్ల స్థాయికి చేరుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. తాను ప్రధాని మోడీతో ఫలప్రదమైన చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉందని ఆ తరువాత జెస్సీ తెలిపారు. పలు విషయాలపై తమ మధ్య సంప్రదింపులు జరిగాయని విలేకరులతో తెలిపారు. అమెజాన్ సిఇఒతో ప్రధాని మోడీ సంప్రదింపులు చాలా ప్రయోజనకరంగా సాగాయని ఆ తరువాత భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ట్వీటు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News