2021 నుంచి 2022 మధ్య కాలంలో గూగుల్ చర్యలు
లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : కొంత కాలంగా మోసాలకు పాల్పడుతున్న లోన్(రుణ) యాప్‌లపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. దాదాపు 2500 మోసపూరిత యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య కాలంలో గూగుల్ తన ప్లే స్టోర్ నుండి 2,500 కి పైగా మోసపూరిత రుణ యాప్‌లను తొలగించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. సుమారు 3,500 నుండి 4,000 లెండింగ్ యాప్‌లను సమీక్షించిన తర్వాత గూగుల్ ఈ చర్య తీసుకుందని ఆమె తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థికమంత్రి ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అలాగే మోసం రుణ యాప్‌లపై తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇలాంటి నకిలీ రుణ యాప్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఇతర రెగ్యులేటర్‌లతో కలిసి నిరంతరం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి సమావేశాల్లో ఈ అంశంపై నిరంతరం చర్చించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి బలహీనతనైనా తొలగించేందుకు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ సెక్యూరిటీ సంసిద్ధతను కొనసాగించడమే ప్రభుత్వ ప్రయత్నమని మంత్రి అన్నారు.
ఆర్‌బిఐ జాబితా సిద్ధం
సీతారామన్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వం కోసం లీగల్ యాప్‌ల వైట్ లిస్ట్‌ను సిద్ధం చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ జాబితాను గూగుల్‌తో పంచుకుంది. ఆర్‌బిఐ తయారుచేసిన వైట్‌లిస్ట్ ఆధారంగా మాత్రమే గూగుల్ తన యాప్ స్టోర్‌లో రుణం పంపిణీ చేసే యాప్‌లను ఆమోదిస్తుంది. ఈ విధంగా నకిలీ లోన్ యాప్‌లను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.