ఆయన 93వ జన్మదినోత్సవ సందర్భంగా…
చెన్నై: ప్రముఖ సినీ నటుడు శివాజీగణేశన్ 93వ జన్మదినోత్సవ సందర్భంగా సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’ తన డూడుల్‌లో శివాజీగణేశన్ ఫోటోను పెట్టింది. ఆ చిత్రాన్ని బెంగళూరుకు చెందిన నూపుర్ రాజేశ్ చోక్సి గీశారు.
శివాజీగణేశన్ అసలు పేరు విల్లుపురం చిన్నయ్య గణేశన్…క్లుప్తంగా వి.సి,గణేశన్. ఆయన 1928 అక్టోబర్ 1న తమిళనాడుకు చెందిన దక్షిణ ఆర్కాటు జిల్లాలోని విల్లుపురంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాజమణి, చిన్నయ్య. ఆయన తండ్రి చిన్నయ్య రైల్వే ఉద్యోగి. తన 7వ ఏటనే ఆయన ఇల్లు వదిలేసి ఓ థియేటర్ గ్రూప్‌లో చేరారు. మరాఠా యోధుడు శివాజీ పాత్రను పోషించడంతో ఆయన దశ తిరిగిపోయింది. డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నా దురై రాసిన ‘శివాజీ కండ సామ్రాజ్యం’ నాటకంలో ఆయన నటించి పేరు తెచ్చుకున్నారు. దాంతో ఆయన పేరులో శివాజీ చేరిపోయింది.
కృష్ణన్ పంజు డైరెక్ట్ చేసిన ‘పరాశక్తి’ అనే సినిమాలో ఆయనకు బ్రేక్ లభించింది. శివాజీ డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకమైనది. తమిళంలో ఆయనలా డైలాగ్ చెప్పేవారు లేరనే చెప్పాలి. ఆయన కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా ‘కప్పల్ ఒట్టియా తమిళన్’ నిలిచింది. ఆ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు వి.ఒ. చిదంబరం మీద నిర్మించింది.
ఆయన నటించిన ప్రసిద్ధ సినిమాలలో తిరువిళయాడల్, తిరువరుత్‌చెల్వర్, తిరుమల్ పెరుమై, అంబికాపతి, ఊటి వరై ఉరవు, కై కొడుత దైవం, తిల్లానా మోగనాంబాల్, ముదల్ మరియాదై వంటివి ఉన్నాయి. చెన్నైలోని టి నగర్‌లో ఆయన ఇల్లు ఉంటుంది. దానికి ‘అన్నయ్ ఇల్లం’ అని పేరు. ఆయన స్వంతంగా ‘తమిళగ మున్నేట్ర మున్నాని’ అని ఓ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రాజకీయ రంగంలో విఫలమయ్యారు. తర్వాత ఆయన తమిళనాడు జనతాదళ్ నాయకుడిగా పనిచేశారు. కానీ త్వరగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు.