న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గోపాల్ విఠల్ దాస్ కొనసాగనున్నారు. మరో అయిదేళ్ల పాటు ఆయనే ఎండిగా ఉండేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. 97 శాతానికి పైగా వాటాదారులు ఆయనే ఎండి, సిఇఓగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఈ మేరకు కంపెనీ వార్షిక సాధారణ సమావేశం( ఎజిఎం)లో నిర్ణయం తీసుకున్నారు. ఆయన వేతనం విషయంలో ప్రతిపాదించిన మరో తీర్మానానికి 89.57 శాతం అనుకూలంగా ఓటు వేయగా, 10.42 శాతం మాత్రమే వ్యతిరేకించారు. ఎయిర్‌టెల్ ఎండి గోపాల్ విఠల్ దాస్ 2018 ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల కాలం 2023తో ముగియనున్న నేపథ్యంలో ఎజిఎంలో దీనిపై చర్చించారు.
వాటాదారుల ఆమోదం పొందడంతో 2023నుంచి మరోఅయిదేళ్ల పాటు అంటే 2028 జనవరి 1వరకు ఆయనే ఎండి, సిఇఓగా వ్యవహరించనున్నారు. అలాగే ఈ కాలంలో ఆయన వార్షిక వేతనాన్ని కూడా నిర్ణయించారు. ఆయన స్థిర వేతనం రూ.9.6 కోట్లు చెల్లించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. ఒక వేళ ఇంక్రిమెంటు ఇచ్చినా ఏడాదికి 15 శాతం మించకూడదు. అలాగే ప్రతిసంవత్సరం చివర్లో పని ఆధారంగా చెల్లించే వేరియబుల్ పే పైనా నిర్ణయం తీసుకున్నారు. 100 శాతం పనితీరు కనబర్చినప్పుడు ఏడాదికి రూ.6.2 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. కాగా 2021 22ఆర్థిక సంవత్సరానికిగాను గోపాల్ విఠల్ రూ.9.1 కోట్లు వేతనం తీసుకున్నారు. దీనికి వేరియబుల్ పే అదనం.