న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తిరస్కరించడంతో మహాత్మాగాంధీ, రాజాజీల మనుమడు గోపాల కృష్ణ గాంధీయే ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసే అవకాశాలు పెరిగాయి. ఈనెల 21న ఢిల్లీలో జరిగే 17 పార్టీల సమావేశంలో గోపాల కృష్ణ గాంధీ పేరును ఏకగ్రీవంగా అంగీకరించే అవకాశాలున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ సన్నిహితుడొకరు తెలిపారు. ఈ సమావేశంలో గోపాల కృష్ణ గాంధీ పేరు ఖరారైన తర్వాత మరోసారి బిజెపియేతర పార్టీలన్నిటితో చర్చలను ముమ్మరం చేస్తామని, కెసిఆర్, జగన్, నవీన్ పట్నాయక్ తదితర నేతలతో కూడా చర్చిస్తామని ఆయన తెలిపారు. గోపాల కృష్ణ గాంధీకి గాంధీజీ మనుమడుగానే కాకుండా మేధావిగా గుర్తింపు ఉన్నదని, ఆయన పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు కార్యదర్శిగా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నార్వే దేశాలకు రాయబారిగా పనిచేశారని తృణమూల్ వర్గాలు తెలిపాయి. బిజెపియేతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఆయనను గెలిపించుకుంటాయా అన్నది చూడాలి మరి…