ముంబై: నడుస్తున్న రైలులో 26 ఏళ్ల మహిళా డాక్టరును లైంగికంగా వేధించినందుకుగాను రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలు దాదర్ ప్రభుత్వ రైల్వే పోలీసుల(జిఆర్‌పి) వద్ద ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. రైలు కర్జత్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఈ ఉదంతం జరిగినందున కేసును కజ్రత్ జిఆర్‌పికి బదిలీ చేశారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ శంబాజీ యాదవ్ కేసు గురించి వివరిస్తూ “ ఆమె ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పుణే నుంచి సిఎస్‌ఎంటికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆమె అంధేరి నివాసి. తన పక్కన కూర్చున్న 40 ఏళ్ల వ్యక్తి మొదట తన నడుమును తాకాడని, కాగా అదేదో పొరపాటుగా జరిగి ఉంటుందని తాను భావించి పెద్దగా పట్టించుకోలేదని, కొద్ది సేపటి తర్వాత ఆమె ద్వారం వద్దకు వెళ్లినప్పుడు కూడా అతడు అక్కడికి వచ్చి తనను తాకాడని ఆమె ఫిర్యాదు చేసింది. తర్వాత ఆమె తన గమ్య స్థానం(థానే)లో దిగిపోకుండా అతడిని అనుసరించి దాదర్ వరకు వెళ్లింది. అక్కడ ఆమె అతడిపై లైంగిక వేధింపు ఫిర్యాదు నమోదు చేసింది. మేము దర్యాప్తు మొదలెట్టాము. సిసిటివి కెమెరా ఫుటేజ్‌ను కూడా స్కాన్ చేశాము. నిందితుడు గొరేగావ్ స్టేషన్‌లో దిగిపోయాడు. మేము బంగూర్ నగర్ పోలీసుల సాయంతో అతడు భరత్ సింగ్ నగర్, గోరేగావ్(ఈస్ట్)చెందిన వ్యక్తిగా గుర్తిం చి సెప్టెంబర్ 6న అరెస్టు చేశాము” అని తెలిపారు. ఇదిలావుండగా నిందితుడు “తనపై వచ్చిన ఆరోపణను తిరస్కరించాడు. కంపార్ట్‌మెంటు నిండుగా ఉండడం వల్ల అనుకోకుండా తన చేయి తగిలి ఉండొచ్చని వాదించాడు. కాగా సోనావనె అనే ఆ నిందితుడిని కళ్యాణ్ రైల్వే కోర్టు ముందు ప్రవేశపెట్టాము. కోర్టు అతడిని మెజిస్ట్రేట్ కస్టడీకి రిమాండ్ చేసింది. కళ్యాణ్‌లోని ఆధర్వాడి జైలులో అతడిని ఉంచారు. అతడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఫిర్యాదు మహిళ ఎదుట అతడిని గుర్తింపు కోసం పరేడ్ చేయించాల్సి ఉన్నందున మేము అతడి బెయిల్ వినతిని వ్యతిరేకించాము” అని తెలిపారు.