Monday, December 23, 2024

మొక్కల ఉద్యమంలో కలాలు, గళాలు

- Advertisement -
- Advertisement -

Goreti venkanna plant tree in Green India Challenge

అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రముఖ కవులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ లు కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వనజీవి రామయ్య విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన గోరటి వెంకన్న, జూలూరి గౌరీశంకర్ లు రవీంద్రభారతి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రకృతిని చూసి పలవరించి కవితలు, పాటలు, నవలలు, కథలయ్యే రచయితలందరూ పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని విజ్ఞప్తి చేశారు. సృజనశీలులైన సాహితీమూర్తుల మూలాలన్నీ చెట్లల్లో పర్యావరణంలోని ప్రతి మొక్కలో, ఆకులో, పిందెలో, మొలకెత్తే విత్తనంలో ఉంటాయని గుర్తుచేశారు.

మొత్తం మానవజాతిని, భూమండలాన్ని రక్షించే ప్రకృతిమాతకు రుణం తీర్చుకునే బిడ్డలుగా ప్రతి మనిషి ఒక మొక్కను నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని ప్రార్థించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా మరింత ముందుకు తీసుకుపోవటంలో సాహిత్య సాంస్కృతిక కళారంగాలు కదలిరావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అడవులు 6 శాతం పెరిగాయని తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేస్తున్న వనరక్షణ ఉద్యమం తెలంగాణకు ఆదర్శప్రాయమైందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు ఎస్. రాఘవేంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రామానంద తీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. కిషోర్, మారగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెర సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి డా. ఎస్. రఘు, సీతారాంలకు జూలూరు గౌరీశంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరగా… కవయిత్రి శిలాలోలిత, కవులు మునాస వెంకట్, వనపట్ల సుబ్బయ్యలకు గోరటి వెంకన్న గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News