Saturday, January 25, 2025

గూర్ఖాలాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆశలు

- Advertisement -
- Advertisement -

గూర్ఖాలాండ్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ 2021లో ప్రారంభించిన త్రైపాక్షిక చర్చలను పశ్చిమ బెంగాల ప్రభుత్వంతో పాటు డార్జిలింగ్ హిల్స్, తెరాయ్, దూవర్స్ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఈ నెల 20న డార్జిలింగ్ బిజెపి ఎంపి రాజు బిస్తాతో చెప్పారు.
జిటిఎ వంటి ‘తాత్కాలిక ఏర్పాట్లు’ ఆ ప్రాంతం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయినందున గూర్ఖాల సమస్యలకు ఒక శాశ్వత రాజకీయ పరిష్కారం కోసం 2021 త్రైపాక్షిక చర్చల్లో డార్జిలింగ్ హిల్స్, దూవర్స్ తెరాయ్ ప్రాంతానికి చెందిన గూర్ఖా ప్రతినిధివర్గం పట్టుబట్టింది. ఆ ప్రాంతంలో అట్టడుగు స్థాయిలో పరిపాలన సంస్థలు లేకపోవడం, ప్రజాస్వామ్యం లోపించడం సహా గూర్ఖాలు, ఆ ప్రాంతానికి సంబంధించిన వివిధ సమస్యలను వారు ప్రధానంగా ప్రస్తావించారు. గూర్ఖాలాండ్ భూభాగ పాలన సంస్థ (జిటిఎ) వంటి సంస్థల రూపంలో తాత్కాలిక పాక్షిక స్వయంప్రతిపత్తి పాలన సంస్థలు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చలేకపోయాయని వారు తెలిపారు. ఆ ప్రాంతం లో ప్రజాస్వామ్య వ్యవస్థ లోటును ప్రతినిధి వర్గం ఎత్తిచూపుతూ, ఆ ప్రాంతంలో 2001 నుంచి పంచాయతీ ఎన్నికలను ఎలా నిర్వహించలేదో, 2017 నుంచి అడ్మినిస్ట్రేటర్ల బోర్డుగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కేడర్‌లను ఉపయోగిస్తూ జిటిఎను ఎలా నడిపారో ప్రతినిధి వర్గం వివరించింది. అందుకే తాము ఆ సంక్లిష్ట సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారం కోరుతున్నామని వారు తెలియజేశారు.
అధికారం హస్తగతం కోసం తమ రాజకీయ ప్రత్యర్థులను ఢీకొనేందుకు గూర్ఖాలాండ్‌ను, పర్వతప్రాంత రాణి ప్రజల మనోభావాలను వివిధ రాజకీయ పార్టీలు ఇంతవరకు వినియోగించుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు టిఎంసి, టిఎంసికి ఉద్వాసన పలికేందుకు బిజెపి దానిని ఉపయోగించుకున్నాయి. గూర్ఖాలు తమకు సొంత ప్రాంతం సాధించేందుకు శతాబ్దాలుగా పోరాడుతున్నారు. కానీ సంక్లిష్టమైన సామాజిక, రాజకీయ నేపథ్యంలో ఆ కల నెరవేర్చుకోవడంలో విఫలమయ్యారు.
గూర్ఖాలాండ్ ఉద్యమ చరిత్ర వలస పాలకుల హయాం నాటిది. ఆనాడు ఆ ప్రాంత స్వతంత్ర ప్రతిపత్తి కోసం పెక్కు డిమాండ్లు వచ్చాయి. గూర్ఖాలాండ్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిల్స్ కిందకు వస్తుంది. దాని సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా డార్జిలింగ్ చరిత్రను అవలోకించడం ముఖ్యం.
సిక్కింలోని చోగ్యాల్ వంశం 1780 దశకానికి ముందు డార్జిలింగ్ ప్రాంతాన్ని పాలించింది. 1780 తరువాత గూర్ఖాలు సిక్కింను, డార్జిలింగ్ సహా ఈశాన్య ప్రాంతంలోని అనేక భాగాలను కైవసం చేసుకున్నారు. 1814 ఆంగ్లో గూర్ఖా యుద్ధం తరువాత 1815లో సుగౌలి సంధి కుదిరింది, దానిని 1816లో ధ్రువీకరించారు. సంధి షరతుల ప్రకారం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్కిం చోగ్యాల్ నుంచి గూర్ఖాలు హస్తగతం చేసుకున్న భూభాగం అంతటినీ స్వాధీనం చేసుకున్నది. బ్రిటిష టిటాలియా సంధి కింద 1817లో సిక్కిం చోగ్యాల్‌ను తిరిగి అధిష్ఠింపజేసి, చోగ్యాల్‌ల నుంచి గూర్ఖాలు కైవసం చేసుకున్న భూభాగం అంతటినీ తిరిగి అప్పగించింది. ఆ తరువాత బ్రిటిష్ 1835లో ఒక ఒప్పందం ద్వారా డార్జిలింగ్ హిల్స్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నది. బ్రిటిష్, భూటాన్ మధ్య సించులా సంధిపై సంతకాలు జరిగాయి. దాని కింద 1864లో బెంగాల్ దువార్స్, కాలింపాంగ్‌లను డార్జిలింగ్ హిల్స్‌లో కలిపారు. ఈనాడు డార్జిలింగ్‌గా పేర్కొంటున్న ప్రాంతం ఆ విధంగా 1866లో ఉనికిలోకి వచ్చింది.
ఆ ప్రాంతంలోని తక్కిన జనాభాకు భిన్నమైన సంస్కృతి గల స్థానిక జనాభా ఎదుర్కొన్న జాతిపరమైన అవరోధాల కారణంగా డార్జిలింగ్ ఏర్పాటైన వెంటనే గూర్ఖాలాండ్ ప్రాంతంలో స్వతంత్ర ప్రతిపత్తి కోసం డిమాండ్లు తలెత్తసాగాయి.
డార్జిలింగ్‌లో ప్రత్యేక పాలన విభాగం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను 1907లో డార్జిలింగ్ హిల్ వ్యక్తుల సంఘం మొదటిసారిగా రేపింది. ఆ ఉద్యమం 1941లో ఊపు అందుకుంది. బెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను మినహాయించి, బ్రిటిష్ సామ్రాజ్యం కింద చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌గా చేయాలని కోరింది. డార్జిలింగ్ జిల్లా, సిక్కింలతో కలిపి గూర్ఖాస్థాన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఐక్య భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) 1947లో రాజ్యాంగ సభకు మెమోరాండం సమర్పించింది. 1952లో అఖిల భారత గూర్ఖా లీగ్ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఒక మెమోరాండం అందజేసి, బెంగాల్ రాష్ట్రం నుంచి వేరు చేయాలని కోరింది. డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బీహార్ జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 1955లో జిల్లా షామిక్ సంగ్ అధ్యక్షుడు దౌలత దాస్ బోఖిమ్ రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిటీ (ఎస్‌ఆర్‌సి)కి ఒక మెమోరాండం సమర్పించారు. డార్జిలింగ్, సంబంధిత ప్రాంతాలలో స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లా మండలి ఏర్పాటును సమర్థిస్తూ 1977 81లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. ఆ తరువాత 1981లో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ప్రాంత పరిషత్ నుంచి ఒక మెమోరాండాన్ని ప్రధాని ఇందిరా గాంధీ అందుకున్నారు. గూర్ఖాలాండ్ కోసం డిమాండ్ గూర్ఖాలాండ్ జాతీయ విమోచన ఫ్రంట్ (జిఎన్‌ఎల్‌ఎఫ్) అధిపతి సుభాస్ ఘైసింగ్ నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది.
198688 ఆ ఉద్యమంలో అత్యంత హింసాత్మక కాలం. రెండు సంవత్సరాల సుదీర్ఘ నిరసనల తరువాత డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ (డిజిహెచ్‌సి) ఒప్పందం కింద 1988లో డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ తుదకు ఏర్పాటైంది. ఆ ఒప్పందంపై జిఎన్‌ఎల్‌ఎఫ్, బెంగాల్ రాష్ట్రం, కేంద్రం సంతకాలు చేశాయి. గూర్ఖాలాండ్ కోసం భారీ ఉద్యమం తిరిగి 2007లో గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జిజెఎం) చీఫ్ బిమల్ గురుంగ్ సారథ్యంలో మొదలైంది. రాజ్యాంగం ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కోసం 2005లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న తరువాత ఆ ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చింది. ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతానికి ఒకింత స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఆ పథకం కోరింది. గూర్ఖాలు ఆరవ షెడ్యూల్ చేర్పును వ్యతిరేకించి, రాష్ట్ర హోదా కోరారు. నాలుగు సంవత్సరాల పాటు సాగిన ఆ ఉద్యమం గూర్ఖాలాండ్ టెర్రిటోరియల్ ఎడ్మినిస్ట్రేషన్ (జిటిఎ) ఏర్పాటు ప్రకటన తరువాత ముగిసింది. డార్జిలింగ్ ప్రాంతానికి పాక్షిక స్వయం పాలక సంస్థ గూర్ఖాలాండ్ టెర్రిటోరియల్ ఎడ్మినిస్ట్రేషన్ (జిటిఎ) ఏర్పాటు కోసం ఒక అవగాహన పత్రం (ఎంఒయు)ను పశ్చిమ బెంగాల్ శాసనసభ 2011లో ఆమోదించింది. 2013లో దక్షిణాదిలో తెలంగాణ ఏర్పాటు దరిమిలా రాష్ట్ర హోదా కోసం డిమాండ్ మళ్లీ తలెత్తింది. జిజెఎం నాయకత్వంలో ఆ ఉద్యమం ఒకింత శాంతియుతంగా సాగింది. వారు ‘జనతా బంద్’ అనే వినూత్న నిరసన పద్ధతిని అనుసరించారు.
డార్జిలింగ్, కాలింపాంగ్, కుర్సియాంగ్ ప్రాంతాలతో కూడిన కొత్త రాష్ట్రానికి గూర్ఖాలాండ్ అని పేరు పెట్టారు. ప్రతిపాదిత రాష్ట్రంలో పక్కనే ఉన్న జల్పాయిగురి, సిలిగురి తెరాయ్, దూవర్స్ ప్రాంతాల్లోని 398 అనుబంధ ప్రదేశాలను చేర్చాలని గూర్ఖాలాండ్ మద్దతుదారులు కోరుతున్నారు. ఆ ప్రాంతాల్లో ఆధిపత్య సమాజంగా గూర్ఖాలు ఉన్నారు. 1901 జనాభా లెక్కల ప్రకారం, నేపాలీ సమాజం డార్జిలింగ్ మొత్తం జనాభాలో 61 శాతం ఉన్నది. ఆ ప్రాంతంలో గూర్ఖాల స్థిర నివాసం కూడా ఆ ప్రాంతానికి కొత్త సాంస్కృతిక బావన తీసుకువచ్చింది. దానితో కొత్త సంస్కృతి ఆవిర్భావం, గూర్ఖాల్లో పెరుగుతున్న జాతిపరమైన అవగాహన, హిల్స్‌లో బెంగాలీల జనాభా తక్కువగా ఉండడం ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌ను పెంచింది. అందువల్ల ఆదిలో మైనారిటీగా ఉన్న వలసవాదులు కాలక్రమేణా జనాభాలో విస్తరించి, అస్తిత్వం కోసం పెనుగులాడసాగారు. వారు ఆ ప్రాంతంలో మరింత సానుకూలంగా అధికారం, ఆధిపత్యం భాగస్వామ్యం కోసం పోరాట శక్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాలన్నిటిలో గూర్ఖాలాండ్ డిమాండ్‌లో దృష్టి కేంద్రీకరింపు ప్రధానంగా డార్జిలింగ్‌పైనే ఉన్నది.
డార్జిలింగ్ ‘పర్వత రాణి’గా పాప్యులర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాంతం టీ ఉత్పత్తికి ఖ్యాతి గాంచింది. అది దేశానికి గణనీయంగా విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. రాష్ట్రం ప్రధాన స్రవంతిలో గూర్ఖా సమాజం సభ్యులను కలుపుకోకుండా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలోనే డార్జిలింగ్‌ను బలవంతంగా అట్టిపెట్టడానికి పశ్చిమ బెంగాల్ రాజకీయంగా ప్రయత్నిస్తోందని ప్రత్యేక రాష్టం కోరుతున్న వారు ఆరోపిస్తున్నారు. గూర్ఖాలాండ్ ఉద్యమం ప్రధాన అజెండా తమ భాష, పశ్చిమ బెంగాల్‌లోని నేపాలీస్ మైనారిటీ గ్రూప్ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి. గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటైనట్లయితే గూర్ఖాలను ‘విదేశీయులు’గా ఇతర భారతీయులు ముద్ర వేయబోరని ఉద్యమ నాయకులు భావిస్తున్నారు. భారతీయులుగా గూర్ఖాల వ్యక్తిత్వాన్ని కాపాడడం జరుగుతుంది. ఆ ఉద్యమం వాస్తవానికి స్వల్ప సంఖ్యాక వర్గంలో పెరుగుతున్న అస్తిత్వభావనకు సూచిక. ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతోంది. దాని మద్దతుదారులు భారత్‌ను వేర్పాటును కోరుకోవడం లేదు, కానీ మాతృ రాష్ట్రం నుంచి వేరు పడాలన్నది వారి ఆకాంక్ష.
కొత్త ఏడాది జనవరి మొదటి వారంలో త్రైపాక్షిక చర్చల పునరుద్ధరణకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ఫలప్రదం అవుతుందని ఆశించాలి. గూర్ఖాలాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, గూర్ఖాల దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించాలి.

గీతార్థ పాఠక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News