అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు
త్వరలోనే మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి పదవినుంచి తన సోదరుడు(అన్నయ్య) మహింద రాజపక్సను తొలగించడానికి అధ్యక్షుడు గొటాబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గొటాబయ రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు.దేశంలో పరిస్థితుల కారణంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రతిపాదనలో గొటాబయ ఈ మేరకు సమ్మతి తెలిపారు. కొత్త ప్రధానమంత్రి ఎంపిక కోసం నేషనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధత తెలిపారని శుక్రవారం అధ్యక్షుడితో సమావేశం అనంతరం మాజీ అధ్యక్షుడు, ఎంపి మైత్రీపాల సిరిసేన తెలిపారు. సిరిసేన నేతృత్వంలో సుమారు 40 మంది అధికార కూటమి అసమ్మతి ఎంపీలు శుక్రవారం అధ్యక్షుడు గొటాబయ రాజపక్సతో సమావేశమయ్యారు. రాజపక్సకు ముందు సిరిసేన శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం రాజపక్సను కలిసిన 40 మంది కూడా ఈ నెల ప్రారంభం దాకా అధికార కూటమిలో ఉన్న వారే. అయితే ఆ తర్వాత వారంతా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మహింద రాజపక్స ప్రధానిగా ఉన్నంతవరకు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని అసమ్మతి వర్గంతో పాటు ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటాబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్సతో పాటు వీరి కుటంబానికి చెందిన ఇతర నేతలపైనా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. అధికారంనుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటాబయ రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. అసమ్మతి జ్వాలలను చల్లార్చడం కోసం అధ్యక్షుడు ఇటీవల మంత్రివర్గంలో మార్పులు చేయడంతో పాటు అన్ని పార్టీలతో కలిపి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలియజేశారు. మంత్రివర్గంలో మార్పుల్లో భాగంగా రాజపక్స కుటుంబానికి చెందిన ముగ్గురు మంత్రివర్గంనుంచి రాజీనామా చేసినప్పటికీ అధ్యక్షుడు, ప్రధాని మాత్రం పదవుల్లో కొనసాగుతున్నారు.
అయితే ప్రధానమంత్రిని తొలగించడానికి అధ్యక్షుడు రాజపక్స ఎలాంటి సమ్మతిని తెలియజేయలేదని,ఒక వేళ అలాంటి నిర్ణయం ఏమయినా తీసుకుంటే ప్రకటించడం జరుగుతుందని ప్రధాని మహింద రాజపక్స అధికార ప్రతినిధి రోహన్ వెలివిటా చెప్పడం గమనార్హం. కాగా విదేశీ అప్పులు భారీగా పెరిగిపోవడం, కరోనా కట్టడికోసం వరసగా లాక్‌డౌన్లు విధించడం, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు అడుగంటడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి ప్రతికూల ప్రభావాలన్నీ ఒకే సారి ఎదురవడంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. శ్రీలంక ఈ ఏడాది 7 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉంది. 2026 నాటికి 25 బిలియన్ డాలర్లు చెల్లించాలి.ఆ దేశ విదేశీ మారక నిల్వలు ఒక బిలియన్ డాలర్లకన్నా తక్కువగా ఉండడం దేశ దీన స్థితిని తెలియజేస్తున్నాయి.