సిజెఐ ఎస్‌ఎ బాబ్డేకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే వారసుని ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తన వారసుని పేరును సిఫార్సు చేయవలసిందిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సిజెఐ) ఎస్‌ఎ బాబ్డేను కేంద్రం కోరినట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డేకు తదుపరి సిజెఐ పేరును సిఫార్సు చేయవలసిందిగా కోరుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఒక లేఖ రాసినట్లు వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించవలసి ఉంటుంది. అయితే ఆ పదవికి ఆ వ్యక్తి ఇతర అర్హతలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
తదుపరి సిజెఐ నియామకం కోసం పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సును కేంద్ర న్యాయ శాఖ మంత్రి తగిన సమయంలో కోరవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి సిఫార్సు అందిన తర్వాత దాన్ని న్యాయ శాఖ మంత్రి ప్రధాన మంత్రికి సమర్పించవలసి ఉంటుంది. దీని ప్రకారం సిజెఐ నియామకంపై ప్రధాన మంత్రి రాష్ట్రపతికి సూచనలు పంపిస్తారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వ్యక్తి అర్హతలపై ఏవైనా సందేహాలు తలెత్తిన పక్షంలో సుప్రీంకోర్టుకు చెందిన ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి తదుపరి సిజెఐ నియామకం చేపట్టాల్సి ఉంటుంది అని నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలు చెబుతున్నాయి.ప్రస్తుత సిజెఐ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ ఉన్నారు. 1957 ఆగస్టు 27న జన్మించిన జస్టిస్ రమణ పదవీకాలం 2022 ఆగస్టు 26 వరకు ఉంది.