విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : ఎఐఎస్‌ఎఫ్
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఎఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఆదివారం యూనివర్సిటీలో భూములను చదును చేస్తున్న జెసిబిల అడ్డుకోవడానికి భూములను రక్షించుకోవడానికి వెళుతున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అడ్డుకొని అరెస్ట్ చేయడం సరికాదని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. ప్రజా పాలనలో విద్యార్థులపై ఉక్కు పాదం మోపడం ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వం యూనివర్సిటీ భూముల అమ్మకాలపై మొండిపట్టుకు పోరాదన్నారు. యూనివర్సిటీలో ఉన్నత ప్రమాణాలు, పరిశోధనలతో, నాణ్యమైన విద్యతో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తే వందలాది ఎకరాల భూమి అవసరం ఉంటుందని వారు పేర్కొన్నారు, యూనివర్సిటీ భూముల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యశాఖ పెట్టుకుని ఇలా యూనివర్సిటీ భూములు అమ్మడం సిగ్గు చేటని, భూములు అమ్మడానికే రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి విద్యార్థులు ఉండే యూనివర్సిటీలో వందలాది పోలీసులతో పాలన చేయడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాల నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.