అసభ్య, అశ్లీల, కొన్ని సందర్భాలలో పోర్నోగ్రఫీ కంటెంట్‌ను ప్రచురణ, ప్రసారం చేస్తున్న 18 ఓటిటి ప్లాట్‌ఫారాలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం వేటు వేసింది. వాటిని బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఈ ప్లాట్‌ఫారాలతో సంబంధం ఉన్న 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు(ఏడు గూగుల్ ప్లే స్టోర్‌లో 3 యాపిల్ యాప్ స్టోర్‌లో), 57 సోషల్ మీడియా అకౌంట్లను భారత్‌లో అందుబాటులో లేకుండా డిజేబుల్ చేసినట్లు కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
సృజనాత్మక వ్యక్తీకరణ పేరిట అశ్లీల, అసభ్య, నీచమైన కంటెంట్‌ను ప్రచురించకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్టాల్‌ఫారాల పైన ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గతంలో అనేక సార్లు పిలుపునిచ్చారు. అశ్లీల, అసభ్య కంటెంట్‌ను ప్రుచరిస్తున్న 18 ఓటిటి ప్లాట్‌ఫారాలను తొలగిస్తున్నట్లు మార్చి 12న ఠాకూర్ ప్రకటించారు. ఇతర మంత్రిత్వశౠఖలతో సంప్రదించి ఐటి చట్ట నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.