న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలకు ముందు అన్ని పార్టీలు సమావేశం కావడం సాంప్రదాయంగా వస్తోంది. రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖర్ కూడా మంగళవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్ష నెతలెవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం రద్దయ్యింది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిజెపి, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మణిపూర్ హింసాకాండ, ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం కూడా బెంగళూరులో సమావేశమయ్యాయి.