Wednesday, January 22, 2025

పేదలకు మెరుగైన వైద్యానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని మార్పులు చేసిందని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని పట్టణంలోని సిహెచ్‌సిలో నియోజకవర్గస్థాయి వైద్య ఆరోగ్యశాఖ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌లు హాజరు కాగా గోండు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఉచిత డయాలసిస్ సెంటర్‌ను, రహదారిని, స్టోర్ రూమ్, వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్‌కు ధీటుగా అన్ని రకాల వసతులతో, వైద్య నిపుణులతో నేడు ప్రభుత్వ దావా ఖానాలో వైద్య సేవలు పేద ప్రజలకు అందుతున్నాయని అన్నారు. దీంతో వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి 8 మెడికల్ కళాశాలలు మంజూరి కాగా అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయగా 155సీట్లతో కళాశాల ప్రారంభమైందని అన్నారు.

అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరికి లబ్ది చేకూర్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. అందుకు లబ్ది దారులే సాక్షి అని అన్నారు. కోవిడ్ సమయంలో సరిహద్దుల్లో సైనికుల్లా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన ఘనత ఆశా, ఎఎన్‌ఎం, వైద్యులదేనని కొనియాడారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యభద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. స్థానిక సిహెచ్‌సి పరిధిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను 24గంటల వైద్య సేవలు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. త్వరలో అశ్వారావుపేటలో బ్లడ్‌బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.

అనంతరం పలువురికి కెసిఆర్ కిట్‌లు, న్యూట్రిషన్ కిట్‌లు అందజేశారు. ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్ రవిబాబు, పర్యవేక్షణ అధికారి డిఆర్‌డిఎ పిడి మధుసూధన్‌రాజు, ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, బిఆర్‌ఎస్ నాయకులు బండి పుల్లారావు, పైడి వెంకటేశ్వారవు, దొడ్డాకుల రాజేశ్వరావు, యుఎస్ ప్రకాషరావు, సంపూర్ణ, మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News