Thursday, January 23, 2025

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి పరుస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాతవరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిని జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆలయ ఈఓ సార శ్రీనివాస్, కమిటీ మాజీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ఆలయాలను పట్టించుకోక నిరాదరణకు గురైన ఆలయాలను పునరుద్దరిస్తున్నారని ఆన్నారు.

తెలంగాణ తిరుపతిలా యదాద్రి ఆలయానికి 1200 కోట్లరూపాయల నిధులతో అభివృద్ధి పరిచి ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా గొప్ప ఆలయంగా తీర్చిదిద్దారని అన్నారు. గతంలో ఏడుపాయలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తుండేవారని, సిఎం కెసిఆర్ వచ్చాక ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఏటా కోటి రూపాయల నిధులుకేటాయిస్తూ వచ్చారని, ఈ నిధులతో ఆలయ పరిసరాలను అభివృద్ధి పరిచామన్నారు. గతంలో ఆలయ వార్షికాదాయం కోటి 60 లక్షల వరకువస్తుండగా నేడు భక్తుల సంఖ్య పెరిగి 6 కోట్ల వరకు వస్తున్నదని అన్నారు. భక్తుల సౌకర్యార్థం పోతంశెట్టిపల్లి నుంచి సిసి రోడ్డు వేశామని, దుకాణాల సముదాయం, కాటేజీలు నిర్మిస్తున్నామని అన్నారు.

భవిష్యత్తులో మరిన్ని విడది గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు అంతేకాకుండా రైస్‌మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ కాటేజీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకుంటున్నామని, ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్న పూజారులకు సైతం దూప దీప నైవేద్యం పథకం ద్వారా వారికి నెలకు 6 వేల రూపాయల పారితోషికం అందిస్తున్నామని, ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో పూజలు చేస్తున్న 49 మంది పూజారులకు దూప దీప నైవేద్యం పథకం పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ…. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని మననం చేసుకుంటూ రాబోవు రోజుల్లో చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని దృక్పథంతో 21 రోజులపాటు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించుటకు ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నదని అన్నారు.

ప్రభుత్వం మతాలను సమదృష్టితో చూస్తూప్రభుత్వ పరంగా పండగలను ఘనంగా నిర్వహిస్తున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు పునర్‌వైభవం తెచ్చేందుకు దూప దీప నైవేద్య పథకం కింద జిల్లాలో 93 ఆలయాలను గుర్తించిందని, మెదక్ నియోజకవర్గంలో 49 ఆలయాలకు నేడు మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు జరిపారు. ఏసు ప్రభు దయవల్ల తెలంగాణ రాష్ట్రం సిద్దించుకోవడం జరిగిందన్నారు. అనంతరం అజంపురలోని మసీదుకు వెళ్లి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి జెంలా నాయక్, బిసి అభివృద్ధి అధికారి శంకర్, ఆర్డిఓ సాయిరాం, పలువురు ప్రజాప్రతినిధులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News