కొల్లాపూర్ ః బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన దేశావత్ బాలునాయక్, దేశావత్ నాను నాయక్, కొడావత్ లక్ష్మణ్, కేతావత్ శక్రుబాలు, శారద, చిన్న మల్లయ్య, కేతావత్ శంకర్, లౌడియా బాల్నాయక్ తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీని నమ్మి చేరిన వారిని అన్ని విధాలుగా అండగా ఉంటామని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
పేదల అభ్యున్నతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులకు నిరంతర కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, అభివృద్ధి చూసి తట్టుకోలేక అధికార పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేకలు మారిపోయాయని అన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారన్నారన్నారు.
రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే ధృడ సంకల్పంతో రైతు బంధు, రైతు భీమా వంటి చారిత్రాత్మక పథకాలను సిఎం కెసిఆర్ రూపకల్పన చేశారన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా లక్షా 116 రూపాయలు అందజేస్తుందన్నారు. సిఎం కెసిఆర్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో భవిష్యత్తులో కొల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.