Monday, December 23, 2024

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు కసరత్తులు!

- Advertisement -
- Advertisement -

బియ్యం ప్రాసెసింగ్ ..మార్కెటింగ్‌పై వ్యూహరచన
త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక
ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం

Paddy grain at the kesamudram agriculture market
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో వరి రైతును యాసంగి ధాన్యం సమస్యనుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో కసరత్తులు చేస్తోంది. తెలంగాణ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వంపై వివిధ రూపాల్లో వత్తిడి పెంచుతూనే మరో వైపు ధాన్యం రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేయదగ్గ పనులపై కసరత్తులు చేస్తోంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు విక్రయించటం , ప్రభుత్వమే నేరుగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లలో వ్యాపారులకు విక్రయించటం, మిల్లింగ్ ద్వారా బియ్యంతోపాటు వచ్చే నూకలును చిరువ్యాపారులకు , దోసెలు, ఇడ్లీలు , పునుగులు ,తదితర బియ్యం పిండి ఆధారిత పిండివంటలు తయారు చేసే వారికి సరసమైన ధరలకు విక్రయించటం వంటి ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

మార్కెట్‌లో ఫౌల్ట్రీరంగానికి కోళ్ల దాణ కింద కూడా విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. పశువుల దాణ కింద కూడా నూకల విక్రయాలకు ఉన్న డిమాండ్‌ను అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో యాసంగి పంటగా రైతులు35లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. మరో వారం పదిరోజుల్లో వరికోతలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి 60లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడిని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. అందులో కంపెనీల అగ్రిమెంట్లపై సాగు చేసిన విత్తన వరి, మిల్లర్లతో ముందస్తు ఒప్పందాలపై చేసిన వరిసాగు వంటివి నేరుగా రైతులే ఆ మేరకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో ఆహారధాన్యాల అవసరాలకు తగ్గట్టుగా ధాన్యం ఎంత అన్నది అంచనా వేసి వాటిని కూడా రైతులకే వదిలిపెట్టనున్నారు.

రైతుల నుంచి ఇంకా సుమారు 40లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సివస్తుందని అంచనా వేశారు. క్వింటాలు ధాన్యం రూ.1960కి విక్రయించగలిగేతనే రైతులు ఒడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగకపోతే మిల్లర్లు క్వింటాలుకు రూ.1600మించి ధాన్యం కొనే అవకాశాలు కనిపించటం లేదు. అదికూడా యాసంగింలో పండిన మొత్తం ధాన్యం కొంటారా అన్నది కూడా సందేహమే. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా కనీస మద్దుతు ధరలు లభించే మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో కసరత్తులు చేస్తోది. ధాన్యం సమస్య పరిష్కారానికి నిపుణుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. మిల్లర్ల మనోగతాన్ని కూడా తెలుసుకుంటోంది.

నూకతోనే సమస్య!

రాష్ట్రంలో యాసంగి ధాన్యానికి సంబంధించి నూకతోనే అసలు సమస్య ముడిపడివుంది. రైతులు డిసెంబర్ నుంచి జనవరి చివరిదాక వరినాట్లతోనే పొద్దు పుచ్చారు. ఈ పంట కోతలు ఈనెల రెండవ వారం నుంచి ప్రారంభమైనా , మే చివరికిగాని పంట పూర్తిగా చేతికందేపరిస్థితి లేదు. ధాన్యం మిల్లింగ్ సమయానికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటనున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే నూకశాతం పెరిగిపోతుంది. ఎఫ్‌సిఐ ధాన్యం సేకరణలో అయితే ధాన్యం మిల్లింగ్ చేస్తే క్లింటాలుకు 67కిలోల బియ్యం రావాల్సివుంది. అందులో 16శాతంగా 16కిలోల నూకకు ఎఫ్‌సిఐ అనుమతిస్తుంది. అయితే యాసంగిలో ఈ మోతాదులో బియ్య లభించే అవకాశాల్లేవని మిల్లర్లు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి ముడి బియ్యం అందజేయాల్సిన పరిస్థితే ఉత్పన్నమైతే క్వింటాలు ధాన్యం మిల్లింగ్ చేస్తే 67కిలోల బయ్యంలో 37కిలోలు నూక వస్తుందని చెబుతున్నారు. మిగిలిన 30కిలోల బియ్యంతోపాటు ఎఫ్‌సిఐ అనుమతించే 16కిలోల నూకను లెక్కలోకి తీసుకుంటే 46కిలొల వరకూ బియ్యం కిందే జమ పడుతుంది. మిగిలిన నూకను ఏవిధంగా మార్కెట్ చేసుకోవాలన్నదానిపైనే నిపుణులు మేధోమధనం చేస్తున్నారు. నూకను సరసమైన ధరలకు విక్రయిస్తే హోటళ్ల యాజమాన్యాలు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ,తోపుడు బండ్లపై ఇడ్లీలు , దోసలు ,పునుగులు ,చేగోడీలు , ఇతర రకాల పిండివంటలు తయారు చేసేవారిని కూడా ఆదుకున్నట్టువుందన్న అభిప్రాయాలు కూడా నిపుణులు వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వమే పౌరసరఫరాల శాఖ ద్వారా నూకలను మార్కెట్ చేయాలా లేక టెండర్ల ద్వారా టోకున నూకలను విక్రయించాల అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయిలో జరుగుతున్న జరుగుతున్న కసరత్తుల్లో మూడు నాలుగు రకాల ప్రతిపాదనలు పరిశీలన చేస్తున్నారు.

త్వరలో సిఎంకు తుది నివేదిక :

యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రైతు సంఘాల ప్రతినిధులు , నిపుణులు, మిల్లర్లు, ట్రేడర్లు , హోటళ్ల నిర్వాహకుల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నింటిని విశ్లేషించి మెరుగైన సూచనలు, సలహాలతో ప్రతిపాదనలు రూపొందింస్తునున్నారు. ఈ ప్రతిపాదనలు వీలైనంత త్వరలలో ముఖ్యమంత్రికి అందజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News