Wednesday, December 25, 2024

పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో సూచించిన మొత్తం కంటే ఎక్కువగా రిజర్వు బాంకు మిగులు నుంచి రూ. 87,420 కోట్లు బదలాయించిన తరువాత కూడా ఇలా జరిగింది. గతేదాది ఈ మొత్తం రూ. 5.42 లక్షల కోట్లు. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆర్థిక శాఖ మంత్రిగా 2023 -24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు వచ్చే పన్నెండు నెలల్లో ఒక వంద రూపాయలు కొత్తగా ద్రవ్యలోటు ఉంటుందని ప్రతిపాదించారని అనుకుందాం. అది ఐదు నెలలకే 36 రూపాయలకు చేరింది, అదే కాలానికి గత ఏడాది రూ. 32.60 మాత్రమే ఉంది. మరింత వివరణ ఏమంటే గతేడాది మొత్తం లోటు రూ. 16.61 లక్షల కోట్లని చెప్పగా వర్తమాన సంవత్సరంలో రూ. 17.86 లక్షలుగా ప్రతిపాదించారు.

మొత్తం పెరుగుదల రూ. లక్షా 25 వేల కోట్లు, ఇప్పటికే లక్ష కోట్లు పోగా ఇంకా మిగిలింది 25 వేల కోట్లు మాత్రమే. వచ్చే ఏడు నెలల్లో ఏ పథకానికి కోత పెడతారు, కొత్త అప్పులు తెస్తారా, కొత్త నోట్లను ముద్రిస్తారా ఏం చేస్తారన్నది చూడాలి. నరేంద్ర మోడీకి సర్వాధికారాలు ఉన్నాయి కదా! ఏం చేసినా అడిగేవారు లేరు. నోట్ల ముద్రణ జరిగితే ధరలు మరింతగా పెరుగుతాయి, రూపాయి విలువ పతనం అవుతుంది.ఇక రెండవ మంచివార్త ఏమంటే మన విదేశీ రుణ భారం 2023 జూన్ నాటికి 629.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. తమ విశ్వగురువు విదేశీ రుణాల మీద ఆధారపడరని, తగ్గిస్తారని భక్త జనులు అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో ప్రచారం చేశారు. 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 2013 డిసెంబరు నాటికి ఉన్న విదేశీ రుణం 409.4 బిలియన్ డాలర్లు మాత్రమే. దానిలో తీర్చింది తీర్చగా ఆ మొత్తం అలాగే ఉందనుకుంటే అదనంగా 220 బిలియన్ డాలర్లు కొత్త అప్పులు చేశారు.

ఇది ప్రతి మూడు నెలలకు పెరుగుతున్నది తప్ప తగ్గటం లేదు. ఈ ఏడాది మార్చి నాటికి 624.3 బిలియన్ డాలర్లకు అదనంగా 470 కోట్ల డాలర్లు తోడైంది. దీన్ని మోడీ సర్కార్ వైఫల్యంగా చెబుతారా, ఘనత అంటారా? గతంలో వాజ్‌పాయి ఏలుబడిలో, యుపిఎ కాలంలో కూడా అప్పులు గణనీయంగా తీసుకున్నారు. విదేశీ రుణాలన్నీ డాలర్లలో ఉండవు. 1991లో మన విదేశీ రుణం 83.8 బిలియన్ డాలర్లు కాగా, దానిలో రాయితీలతో కూడిన మొత్తం 45.9 శాతం ఉండేది. అది తరువాత క్రమంగా తగ్గుతూ 2013 నాటికి 11.1కి 2022 డిసెంబరు నాటికి 8.1 శాతానికి తగ్గింది.
అంకెలతో జనాన్ని తిమ్మిని బమ్మిని చేయవచ్చు. దానిలో భాగంగానే విదేశీ అప్పు మొత్తం పెరిగిందని ఒక వైపు అంగీకరిస్తూనే మార్చి నెలతో ముగిసిన దానితో పోలిస్తే జూన్ నాటికి జిడిపిలో అప్పు శాతం 18.8 నుంచి 18.6 శాతానికి తగ్గినట్లు ఆర్‌బిఐ చెబుతోంది. ప్రభుత్వ అప్పు తగ్గింది, ప్రభుత్వేతర అప్పు పెరిగిందని కూడా పేర్కొన్నది. గతంలో కూడా ప్రభుత్వ అప్పు తగ్గింది తప్ప పెరగలేదు, కానీ బిజెపి నేతలు దాని గురించి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు కాంగ్రెస్ పాలన గురించి నానాయాగీ చేశారు.

మొత్తంగా పెరిగిందా లేదా అన్నది గీటురాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన అప్పు తక్కువ అని మరో సన్నాయి నొక్కు. ప్రతి దానికి చైనాతో పోలుస్తున్నారు, దాని విదేశీ అప్పు జిడిపిలో 13.6 శాతం ఉంది, దాని కంటే మన అప్పు ఆరుశాతం ఎక్కువ. ఇంటా బయటా అప్పులు చేసి లేదా ప్రయివేటు అప్పులకు హామీ ఇచ్చి సాధించింది ఏమిటి? కాంగ్రెస్ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తన తొలి ఐదు సంవత్సరాల పాలనలోనే సాధించినట్లు నరేంద్ర మోడీ చెప్పుకున్నారు. అందువలన పదేండ్ల కాలం తక్కువేమీ కాదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. విధానాలను అమలు జరపటానికి వచ్చిన ఇబ్బందిలేదు. ఒక దేశ అభివృద్ధికి ఒక కొలమానం మానవాభివృద్ధి సూచిక.ఐరాస అభివృద్ధి ప్రమాణాల (హెచ్‌డిఐ) ప్రకారం 0.550 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన దేశాలు తక్కువ, 0.550 0.699 మధ్య ఉన్నవి మధ్యరకం, 0.699 నుంచి 0.799 పాయింట్లు వస్తే ఉన్నత, 0.800 కంటే మించితే అత్యున్నత వృద్ధి సాధించిన దేశాలుగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ప్రకటించిన 2022 నివేదిక ప్రకారం 0.633 పాయింట్లతో మన దేశం 188 దేశాల జాబితాలో 132 వదిగా ఉంది.

నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న 130 నుంచి రెండు స్థానాలు దిగజారింది. మన దేశం ఇచ్చిన సమాచారం ప్రకారమే విశ్లేషించి సూచికలను రూపొందిస్తారని తెలిసిందే. ఎందుకీ దిగజారుడు? ఇష్టం ఉన్నా లేకున్నా చైనాతో పోలుస్తున్నారు గనుక అదెక్కడ ఉందో చూద్దాం. తాజా సూచిక ప్రకారం 0.768 పాయింట్లతో 79వ స్థానంలో ఉంది. ఈ సూచికలకు ఇచ్చే పాయింట్లు ఆయా దేశాల్లో జరిగే వృద్ధిని బట్టి ఏటా మారుతూ ఉంటాయి. లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్య, ఆదాయం, అసమానతల వంటి 13 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.తన పాలనలో జిడిపి గణనీయంగా పెరిగిందని, త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చుతామని, 2047 నాటికి చైనాను కూడా అధిగమిస్తామని బిజెపి నమ్మింప చూస్తున్నది. రాష్ట్రాలు రుణాలు తీసుకోవద్దని, సంక్షేమ పథకాలకు అనవసరంగా ఖర్చు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెబుతున్నారు. కానీ ఆ పెద్ద మనిషి ఏలుబడిలో జరిగిందేమిటి ? 2013 14 సంవత్సరంతో పోల్చితే 2022 23నాటికి స్వదేశీ అప్పు 174 శాతం, విదేశీ అప్పు వంద శాతం పెరిగింది.

కాగ్ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రూ. 50,68,235 కోట్లు. వర్తమాన సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో అప్పుల గురించి నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన పత్రం ప్రకారం 2023 మార్చి నెల ఆఖరుకు రూ. 152,61,122.12 కోట్లుగా ఉన్నది. 2024 మార్చి ఆఖరుకు రూ.169,46,466.85 కోట్లకు చేరుతుంది. ఎన్నికల సంవత్సరం గనుక ఇంకా పెరగటమే తప్ప తగ్గే అవకాశం లేదు. దీనిలో స్వదేశీ అప్పు రూ. 147,77,724.43 కోట్ల నుంచి రూ. 164, 23,983.04 కు, విదేశీ రుణం రూ. 4,83,397.69 నుంచి రూ. 5,22,683.81 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఇంత అప్పు చేసినా మానవాభివృద్ధి సూచికలు దిగజారాయంటే ఆ సొమ్మును జనానికి గాకుండా కార్పొరేట్లకే కట్టపెట్టారన్నది స్పష్టం. పెంచిన పన్ను భారాలు, అప్పుల గురించి అడిగితే జాతీయ రహదారులు, రైల్వేలను అభివృద్ధి చేశామంటారు. నిజమే, వాటిని వినియోగించుకున్నవారి నుంచి వసూలు చేస్తున్న టోలు టాక్సు, ఎంత? సామాన్యులు ఎక్కే పాసింజరు రైళ్లను రద్దు చేసి వాటిని ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో జనాన్ని బాదుతున్నారు.

వృద్ధులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు. రిజర్వేషన్ల రద్దుకు ఎంత వసూలు కోత పెడుతున్నారో తెలిసిందే. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 వరకు టోల్‌టాక్సు రూ. 17,942 కోట్ల నుంచి రూ. 48,028 కోట్లకు పెరిగింది. దీనిలో సరకు, ప్రయాణీకుల రవాణా వాహనాల నుంచి వసూలు చేసేదే ఎక్కువ అన్నది తెలిసిందే, అంటే ఆ మేరకు జనం మీద భారం మోపుతున్నారు.ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఆందోళనకరంగా ఉంది. తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయని కారణంగా దేశంలో అన్ని వయసుల వారిలో రక్తహీనత (అనీమియా) పెద్ద సమస్యగా ఉంది. కుటుంబ జాతీయ ఆరోగ్య సర్వే 5 (2019 21) ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేండ్ల మధ్య వయస్సు పిల్లల్లో 67 శాతం, 15 19 సంవత్సరాల బాలికల్లో 59, బాలురలో 31, పిల్లల్ని కనే వయస్సున్న మహిళల్లో 57, గర్భిణుల్లో 52, గర్భిణులు కాని మహిళల్లో 57 మంది రక్తహీనతతో ఉన్నారు.

అంతకు ముందు చేసిన సర్వే 4 వివరాలతో పోలిస్తే పైన చెప్పుకున్న అన్ని తరగతుల వారిలో ఈ సమస్య తీవ్రత పెరిగింది. దేశానికి గుజరాత్ తరహా అభివృద్ధిని అమలు చేస్తానని నరేంద్ర మోడీ చెప్పారు. ఆ గుజరాత్ పిల్లల్లో తీవ్రత 62.6 నుంచి 79.7 శాతానికి పెరిగింది. ఈసురో మని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని మహాకవి గురజాడ చెప్పింది ఇలాంటి వారి గురించే. 2018లో అనీమియా ముక్త భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అది ఏమేరకు ఫలితాలు ఇచ్చిందో ఇంకా ఏమి చేయాలో తెలియాలంటే సర్వేలు తప్ప మరొక మార్గం లేదు. కానీ, ఆరవ విడత నిర్వహించదలచిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆ సమాచారాన్ని రాబట్టే ప్రశ్నలనే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఎందుకంటే తీవ్రత తగ్గకపోతే మోడీ సర్కారు వైఫల్యం వెల్లడవుతుంది. అంతకు మించి మరొక కారణం కనిపించటం లేదు.
దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో డైట్, బయోమేకర్స్ సర్వే(డాబ్స్1) ఆ సమాచారాన్ని సేకరిస్తుందని కేంద్ర ప్రకటిచింది.

మన దేశంలో తృణధాన్యాల వినియోగం గురించి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 2019 సంవత్సర వివరాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాపితంగా తలసరి ఆహారం, దాణాగా 304 కిలోలు వినియోగిస్తున్నారు. మన దేశంలో 171 కిలోలు, ఆఫ్రికాలో 190, బాగా వెనుకబడిన దేశాల్లో 205, బ్రెజిల్, చైనాలో 360, రష్యాలో 407, ఐరోపా పారిశ్రామిక దేశాల్లో 494, అమెరికాలో 590 కిలోలు ఉంది. దీన్ని బట్టి 121 దేశాల్లో మన దేశం ఆకలి సూచికలో 107 వదిగా ఎందుకు ఉందో అర్ధం చేసుకోవటం కష్టం కాదేమో? రాష్ట్రాలకు చెందాల్సిన న్యాయమైన వాటాను రాకుండా ఎగవేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొన్ని భారాలను చూస్తే స్వచ్ఛ భారత్, విద్య, ఆరోగ్యం, రోడ్డు, నాణ్యమైన ఇంధనం, వ్యవసాయం పేరుతో విధిస్తున్న సెస్‌ల గురించి జనానికి తెలిసిందే తక్కువే. రాబడి కోసం ఔరంగజేబు ముస్లిమేతరుల మీద విధించిన జిజియా పన్ను గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నదేమిటి ?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News