న్యూఢిల్లీ: దేశంలో 2025-26లో 200 రోజుల క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. వీటిలో రోగులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తారు. రాబోయే మూడు సంవత్సరాలలో అన్ని జిల్లాల్లో ఇటువంటి కేంద్రాలు ఏర్పాటవుతాయని ఆరోగ్య శాఖ మంత్రి జెపి. నడ్డా మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తర సమయంలో అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను సరసమైన(ఆఫర్డబుల్), ప్రాప్యత(యాక్సిసిబుల్), సామాన్యమైనది(ఈక్విటబుల్)గా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రతి జిల్లాలో డే క్యాన్సర్ కేర్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు కేంద్ర బడ్జెట్ పేర్కొందని నడ్డా తెలిపారు.
మరో మూడేళ్లలో అన్ని జిల్లాల్లో డే క్యాన్సర్ సెంటర్లు 200 తెరువబోతున్నట్లు ఆయన వివరించారు. ఝజ్జర్ ఎయిమ్స్ దేశంలోనే 700 పడకలున్న అతి పెద్ద క్యాన్సర్ సెంటర్ అని ఆయన వివరించారు. ఓ ప్రశ్నకు సమాధానంగా గోరఖ్‌పూర్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) తన ఓపిడి, ఐపిడిలతో పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు.‘ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం, ఆయుష్మాన్ భారత్ పెద్ద సహకారాన్ని అందించింది. ఈ కార్యక్రమం కింద స్క్రీనింగ్ జరిగిన నెల రోజుల్లోనే క్యాన్సర్ చికిత్స ప్రారంభమైంది’ అని అధికార పక్షం బల్లలు చరుస్తుండగా ఆరోగ్య మంత్రి నడ్డా తెలిపారు.