Thursday, January 23, 2025

రైతు ఆత్మగీతం మట్టి బండి

- Advertisement -
- Advertisement -

మనం మూడు పూటలా తింటాం. కానీ అలా తినడానికి మూలమైన వ్యక్తిని మర్చిపోతాం. మట్టిని మర్చిపోతాం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశమని చెప్పుకుంటాం. అన్నపూర్ణ అంటాము. కూటి దేవుణ్ణి మర్చిపోతాం. గుడి దేవుడిని గుండెల్లో పెట్టుకుంటాం. ఉత్సవాలు చేస్తాం. ఊరేగింపులు చేస్తాం. నాగలి భుజానేసుకొని లోకపు ఆకలిని మోస్తున్న రైతుని విస్మరిస్తాము. రైతు ప్రభుత్వాలు అంటారు. గిట్టుబాటు ధరలు ఉండవు. రైతు భరోసాలు ఉంటాయి. కానీ అవే మాత్రం ఆసరా కావు. ఈ నేపథ్యంలో తన సొంత ఊర్లో ఉన్న పొలాన్ని అమ్ముకున్న రైతు హృదయ గానం మట్టిబండి. ఇది ఎండకు నెర్రిలిచ్చిన, వానకు కరిగిపోయిన మట్టి బండి లాంటి రైతు కన్నీటి గానం. సాగుతో జీవనం సాగక ఆగిపోయిన మట్టి మనిషి వ్యధ.నీళ్ళే లేని కయ్య బాధ.రైతు జీవితం వ్యవసాయ నేపథ్యంలో పదుల సంఖ్యలో దీర్ఘ కవితలు వచ్చాయి. పల్లెకు దండం పెడతా- బి హనుమారెడ్డి ,దుక్కి చూపు -కొండ్రెడ్డి, నాగేటి గోడు. ఆకుమడి -ఎమ్మెస్,పొలి -రాచపాలెం, ముంత పొగ -యార్లగడ్డ పొలికేక- సుధేర, నాగలి -గంటేడ గౌరు నాయుడు,ముద్ర బల్ల -దాట్ల దేవదానం రాజు దుఖ్ఖేరు- ఛాయారాజ్, నిప్పుల వాన -అల.. ఈ విధంగా చాలా దీర్ఘ కవితలు వచ్చాయి.

ఇప్పుడు నాగభైరవ ఆదినారాయణ గారు మట్టి బండిని కవితా పాదాలతో తోలుకొని వస్తున్నారు. మట్టిబండి ప్రతికాత్మక శీర్షిక. ఇందులో కథనాత్మక శైలిని కవి చక్కగా వాడుకున్నారు .ఈ దీర్ఘ కవిత ప్రారంభ వాక్యం పొలాన్ని అమ్మేశాను అని ఉంటుంది .రైతు జీవితం తెలిసిన మనిషికి ఈ వాక్యంతోనే గుండె కలుక్కుమంటుంది. ఈ వాక్యం గొప్ప కవితా వాక్యం కాకపోవచ్చు కానీ పొలాన్ని అమ్మడం అంటే మట్టితో బొడ్డు పేగును తెంచుకోవడం మట్టితో బంధాన్ని కోల్పోవడం పొలాన్నే కాదు కంటిపాప లాంటి సొంత బిడ్డలాంటి ఎడ్లను అమ్ముకున్నాడు .ఎడ్లు లాగే బండిని అమ్ముకున్నాడు. అనువంశికత న్యాయాన్ని ఉల్లంఘిస్తూ అన్నీ అమ్ముకున్నాడు. ఇలా ప్రారంభమైన దీర్ఘ కవిత పొలాన్ని అమ్ముకోవడానికి గల కారణాలను చెప్తూ సమకాలీన రైతు జీవిత సమస్యలను ఆవిష్కరిస్తూ అప్పటి జ్ఞాపకాలను కలబోసుకుంటూ సాగుతుంది.ఈ కావ్యంలో రైతుకు ఎడ్లంటే ప్రాణం. ఎడ్లంటే ఏ రైతుకైనా ప్రాణమే. ఆ ఎడ్లను గురించి చెబుతూ/ ‘ఆకలైతే అంబా అని అరవడం తప్ప/ పలుకుతాళ్లను తెంపవు/ కట్టు గుయ్యలను పెరకవు/ చిక్కాల కట్టకపోయినా / పక్క చెలల్లో గడ్డిపరకలను కూడా ముట్టేవి కావు‘

ఈ వాక్యాల్లో కవి ధ్వనిని మనం పరిశీలించాలి. ఇందు లో మనుషుల నాయకుల పోకడను కవి కన్యాపదేశంగా చెప్పాడు. పశువు అంటే పాశం చేత కట్టబడింది కానీ రైతు ఎడ్లు పరాయి సొమ్ము కోసం ఆశపడేవి కావు. అనే నేడు రాజకీయ నాయకులు, అనేక మంది స్వార్థ పరులు నిజాయితీ కోల్పోయి జాతిని దోచుకోవడం గురించి కవి గుర్తు చేస్తున్నాడు. గతంలో వ్యవసాయంలో ఎడ్లు నేలను దున్నడం దగ్గర నుండి, పంట ఇంటికి చేరే వరకు రైతుతో మమేకం అయ్యేవి. ఈ దీర్ఘ కవిత మొదటి నాలుగు పుటల్లో రైతు కు, ఎడ్ల కు ఉన్న అనుబంధం తెలుపుతుంది. ఎడ్లతో పాటు బండి కూడా ఉండేది. ఆ బండి ఎన్ని విధాలుగా తన వ్యవసాయంలో తన కుటుంబంలో భాగమైందో కవి హృద్యంగాగా చిత్రీకరించాడు. ఆ ఎడ్ల బండి ఆసుపత్రి మోసుకెళ్ళే అంబులెన్స్ అయ్యేది ఆ ఎడ్ల బండి తిరుణాలలో జాతరలో దేవుడిని ఊరేగించే పల్లకి అయ్యేది. కవి పెళ్లి సందర్భంగా పెళ్లి అయ్యాక తన సహచరి అదే ఎడ్ల బండిమీద తన ఇంటికి రావడానికి గుర్తు చేసుకుంటాడు. నా ఇల్లాలు ఈ బండిలోన వచ్చి ఇంటికి దీపమైందని నా ఆత్మకు రూపం అయిందని కవి చెప్పడం , బండి తో తన జీవితం ఎంత గా ముడి పడి ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
‘పంటల కాలంలో/ దాన్యపు బస్తాలతో /నిండు గర్భిణిలా /మెల్లగా సాగి వచ్చే బండిని చూస్తే/ బంగారాన్ని మోసుకొచ్చే లక్ష్మీదేవి అనిపించేది /ఏడాది పాటు కడుపు నింపే / కూటికుండ అనిపించేది‘ ఇలా కవి రైతు జీవితంతో ముడిపడి ఉన్న అనేక దృశ్యాలను భావ చిత్రాలుగా, పద చిత్రాలుగా పాఠకుల్ని ఆకట్టుకుంటాడు.

అక్కడి నుంచి కావ్యం పొలం వైపు వెళుతుంది. పొలంతో తనకున్న జ్ఞాపకాలను కవి గుర్తు చేసుకుంటాడు. పొలానికి వెళుతూ దాటిన ఉబ్బలి వాగు, ఊబిలో కూరుకున్న సందర్భంలో కాపాడిన తాత చేయి, పొలానికి దగ్గరలో ఉన్న పరమేశుకుంఠ, ఆ కుంఠలో వేళ్ళు ముంచితే తగిలే చేప పిల్లలు, వాటి గిలిగింతలు ,కడవలతో నీళ్లు తీసుకుని వెళుతున్న కాపు పడుచులు ,పడతుల పాదాలతాకిడికి పరవశించి గట్లుపరిచే గరిక తీవాచీలు, వేసవి తాపానికి స్నాన మాడే గేదెలు, పుట్టగో చులుబిగించి ఈతాడే గొడ్లు కాసే కుర్రాళ్ళు ,గేదెలపైకి ఎక్కి కూర్చున్న కుర్రాళ్ళు, ఐరావతాన్ని అధిరోహించిన అమరపతి లాగా కనిపించడం, చెనుపరవ మీద ఉన్న జమ్మి చెట్టు ,జమ్మి చెట్టు కుకట్టిన ఉట్టి అందులో ఉన్న కూటి దుత్త ,ఆ జమ్మి చెట్టు కొమ్మకు వేలాడుతున్న నీటితో నిండిన తాబేటి బుర్ర ఈ విధంగా ప్రతి దృశ్యాన్ని కవి కంటి ముందు జరుగుతున్నట్టే రాశారు. దుక్కి దున్నడం, నాట్లు వేయడం, పైరు కోయడం, గడ్డి వాములు వేయడం ,పొలాల్లో ఆటలు ఇవన్నీ చూపెడతారు. గడ్డివామిని పరవశంతో పడగల విప్పి పెనవేసుకున్న పెనుబావులతో పోల్చడం ఔచిత్యంగా ఉంది.

‘ఇప్పుడు ఈ పొలాన్ని అమ్మేసిన/ తుట్టెను కదిపితే/ కుట్టే కందిరీగల్లా / జ్ఞాపకాలు నన్ను/ చుట్టుముడితేనే ఉన్నాయి’ అని వాపోతాడు. కొన్నాళ్లు క్రితం రైతు జీవితం ఎలా ఉండేదో అంటే ఈ ప్రపంచీకరణ, పెట్టుబడి దారులు, స్వార్థపు దళారీ వ్యవస్థ లేని రోజుల్లో రైతంటే సస్యం అనే అశ్వాన్ని అధిరోహించి ఆకలి రాకాసి నుండి లోకాన్ని కాపాడే రౌతు అని చెప్తారు.
‘ఇప్పటి మాదిరిగా రైతంటే పరాన్న బుక్కు కాదు/ రైతంటే/ ఏడాది పొడవు నా/ సాగు అనే యాగాన్ని ఆచరించే గొప్ప ఋత్విక్ /రైతంటే అన్నప్రదాత/మన్ను నుండి పరబ్రహ్మ స్వరూపాన్ని /రూపొందించే విధాత/ ఆది భిక్షువు బుభూక్ష నైనా తీర్చగల త్రాత’ ఈ పాదాల్ని చదివిన పాఠకుడు ఒకసారిగా విస్మయానికి గురవుతాడు. ఇక్కడ గొప్ప శిల్పం కనిపిస్తుంది కవికి భాష పై ఉన్న పట్టు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీర్ఘ కవితను నడపడం మామూలు విషయం కాదు నడకలో దెబ్బతింటే అది వంకర్లు పోతుంది. వాక్యం వికలాంగత్వం పొందుతుంది. కవి హలికుడిని బహువచనం గా చెప్తాడు .విశాల విశ్వానికి తిండి పెట్టే స్వాతి ముత్యం గా చెబుతాడు. వర్షపు చినుకులను ఓడిసిపట్టి పచ్చదనాన్ని పసిడిగా మార్చే కార్మికుడు అంటాడు. ఆదాయంలో వామనుడు గానే ఉన్నా అంతరంగం నిండా బలితత్వం అని ధ్వనిస్తాడు.

ఆ తర్వాత కాలంలో రైతు ఎలా దెబ్బతిన్నాడో, ప్రకృతి ,ప్రభుత్వాలు, వ్యాపారులు రైతును ఎలా దెబ్బతీరో ఒక్కో కారణాన్ని కవిత్వీకరించే ప్రయత్నం చేశారు. దేశాన్ని దోచుకునే బడా వ్యాపారులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతులుకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించాడు. మద్దతు ధర గురించి చేసే వంటరి పోరాటాన్ని, కష్టాల శిలువని మోస్తూ దీనంగా వేలాడే ఏసుక్రీస్తులలా,రైతు జీవితం పునరుత్థానం కావాలని ఆకాంక్షించాడు.‘అతివృష్టి అనావృష్టి/ కాలనాగులై కాటేసినప్పుడు/ తన సీరాన్ని సిరాలో ముంచి/ తన లలాటంపై/ తన ఆత్మహత్యను / తానే లిఖించుకునే విధాత రైతు‘/పై వాక్యంలో కూడా కవికి భాష మీద బాబు కథ పట్ల ఉన్న అవగాహన ఎరుకలోకి వస్తుంది. ఇన్నేళ్లుగా ఎన్నాళ్ళుగా కష్టపడే రైతుకు పెద్దమ్మ తప్ప చిన్నమ్మ దర్శనం ఇవ్వడం లేదని చమత్కారం చేస్తాడు. చిన్నమ్మ పెద్దమ్మలు ఎవరో వేరే చెప్పక్కర్లేదు. ఇవాళ కలుపుకు, పలుపుకు, అరకకు, పరకకు, గట్టుకు, పుట్టకు తేడా తెలియని నాయకులు, అధికారులు రైతుల భవితవ్యాన్ని నిర్ణయించడాన్ని గమనించ మంటాడు. ప్రశ్నించమంటాడు. మేలుకోమంటాడు. రైతు ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.

లాఠీలు చేత రైతుల్ని కొట్టించడం, లారీల చేత తొక్కించడాన్ని అసహ్యించుకున్నారు. ఈ దీర్ఘ కవితలో కవి వాడిన పదజాలం ఒకసారి పరిశీలిస్తే ఇందులో చాలావరకు పదాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో నాళ్ళు పోయాక ఈ పదాలకు అర్ధాలు తెలియని తరం తయారు అవుతుంది. బహుశా ఇప్పటికే చాలామందికి ఈ తరంలో ఈ పదాలు దూరమయ్యాయి. కాడి, నోగ, గాదె, బొడ్డువార్లు, కందెన గుడ్డ, చట్టి, పలుపుతాడు, చిక్కాలు, కుడితి, ఉట్టి, దుత్త, తుండు గుడ్డ, కబళం, మేర, తంపట్లు, అంగలు, చూడి, ఇక జానపదుల పదాలను, వ్యవసాయ సంబంధ గాలను నాగ భైరవ ఆదినారాయణ గారు ఆయా సందర్భాల్లో అద్భుతంగా వాడుకున్నారు.
మరికొన్ని అంశాలు
1. ఈ దీర్ఘ కవిత అఖండిత శైలిలో సాగింది.
2. మట్టి బండి వాన చినుకులకు, ఎండకు దెబ్బతిన్నట్టుగానే రైతు జీవితం ఎలా దెబ్బతినిందో చెప్పారు.
3. వచనం పాళ్లు అక్కడక్కడ ఎక్కువైనట్లు అనిపించిన ఆ వెంటనే వచ్చే వర్ణనలు,శబ్దాలంకారాలు దీర్ఘ కవితని పరిపుష్టం చేశాయి.
4. పుస్తకాన్ని ఇంకా గ్రాండ్‌గా తెచ్చి ఉండవచ్చు
5. నాలుగు లేదా ఐదు భాగాలుగా విభజించి ఉంటే బాగుణ్ణు. ఇది సూచన మాత్రమే.
ఏది ఏమైనాప్పటికీ రైతు జీవితాన్ని, అన్నం పెట్టే రైతుని హత్తుకున్నందుకు ఆదినారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన అన్నట్టుగానే ఇక ముందు వ్యవసాయం రైతుల పాలిట ఉరికోయ్య, కష్టనష్టాలు అంపశయ్య కాకూడదని ఆశిస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News