Wednesday, January 22, 2025

శంకర్‌పల్లిలోని ఐదెకరాల భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ

- Advertisement -
- Advertisement -

సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ డిఆర్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు
అసలు యజమాని బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు
అసలు భూ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి సంఘటన

మన తెలంగాణ/హైదరాబాద్:  ఐదెకరాల భూ కుంభకోణంలో ఒక డిఆర్ (డిస్టిక్ రిజిస్ట్రార్) కూడా భాగస్వామి కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సంఘటనపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, అసలు నిందితులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఈ డిఆర్ తన భార్య పేరు మీద కూడా ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించడం కోసం శంకర్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ ఆదేశించడంతో అధికారులు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌తో పాటు డిఆర్ నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలిసింది.

అయితే ఈడిఆర్ ముందు నుంచి వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తన పరిధిలోని సబ్ రిజిస్ట్రార్‌లను వేధించడం దగ్గర నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి స్థలాల్లో వివాదాస్పదంగా ఉండే స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఆయన తనదైన స్టైల్‌లో వాటిని పరిష్కరించే వారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు తన పరిధిలోని ఒక పోస్టు కోసం గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్‌ను గ్రేడ్ 1 స్థానంలో నియమించుకొని, పలు వివాదాస్పద నిర్మాణాల రిజిస్ట్రేషన్‌లను చేయించుకున్నట్టుగా తెలిసింది. దీనికి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ నాయకుడి అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నట్టుగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. అయితే ఈ డిఆర్‌పై గతంలో పలు ఆరోపణలు వచ్చినా అప్పటి మంత్రి అండదండలు ఆయనకు ఉండడంతో ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్‌పల్లిలో జరిగిన భూ కుంభకోణం నేపథ్యంలో ఈ డిఆర్ పేరు బయటకు రావడంతో ఆయన కొన్నేళ్లుగా తీసుకుంటున్న వివాదస్పద నిర్ణయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ డిఆర్ పలువురు సబ్ రిజిస్ట్రార్‌లను బెదిరించి పలు రిజిస్ట్రేషన్‌లను చేసుకున్నట్టుగా వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది.
నలుగురి పేరుపై గత నెలలో రిజిస్ట్రేషన్..
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని సర్వే నంబర్ 334, 335లోని 5.12 ఎకరాల భూమిని ఎస్‌ఆర్‌ఎంటి డైరెక్టర్ ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణది. ప్రస్తుతం ఆయన చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్‌ను సమర్పించి నలుగురు ఆయన భూమిని జనవరి 2024లో శంకర్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో రవీంద్రకుమార్, పి.ప్రశాంత్, నీలం గౌడ్, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ భార్య హరి రజనీలు ఉన్నారు. అయితే అసలు భూమి యజమాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పటికే దీనిపై అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా తప్పు జరిగిందని సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సబ్ రిజిస్ట్రార్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు :  హైదరాబాద్ సౌత్ డిస్ట్రిక్ రిజిస్ట్రార్ డివి. ప్రసాద్
శంకర్‌పల్లిలో జరిగిన భూ కుంభకోణంపై డిఆర్‌ను వివరణ కోరగా తాను సబ్ రిజిస్ట్రార్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని పేర్కొన్నారు. అంతా కేవైసి ప్రకారమే రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన తెలిపారు. ఈ భూమిపై సివిల్ వివాదంతో సబ్ రిజిస్ట్రార్‌కు సంబంధం లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News