Tuesday, November 5, 2024

మహిళా లోకం ‘జాగృతి’తోనే బిల్లు

- Advertisement -
- Advertisement -

‘ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజల డిమాండ్ల మేరకు, ప్రజల కోసం పని చేయడమే ప్రజాస్వామ్యం’ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఈ నిర్వచనం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. మన దేశంలో ప్రజాప్రతినిధుల వేదిక పార్లమెంటు. ఇది ప్రజల ఎజెండాను మాత్రమే చర్చించాలి. పాలకుల ఎజెండాను ఏమాత్రం కాదు. ఇవాళ సమాజంలో సగభాగం ఉన్నది మహిళలు. వారికి ప్రాతినిధ్యం తగినంత లేదు. దీనికి పరిష్కారం మహిళలకు రిజర్వేషన్ కల్పించడమే.. అన్న విషయాన్ని గుర్తించి, ఇన్నాళ్లకైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం వెనుక బిఆర్‌ఎస్ పార్టీ, భారత జాగృతి సంస్థల కృషి ఎంతో ఉన్నది.

ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్’ పేరుతో కేంద్రం ప్రవేశపెట్టడం హర్షణీయం. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. ముఖ్యంగా మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం సాగించింది. ఈ మేరకు సిఎం కెసిఆర్ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. అదే విధంగా తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటానికి చైతన్యశీలమైన పాత్రను పోషించిన ‘తెలంగాణ జాగృతి’, ‘భారత జాగృతి’గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు,ఎంఎల్‌సి కవిత మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నా దేశ నేతలందరి దృష్టినీ ఆకర్శించింది.

అపుడు తెలంగాణ ధిక్కారానికి ప్రతీకలుగా మన చరిత్రలో నిలిచిన సమ్మక్క- సారలమ్మ, రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, అరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యంల వారసత్వం కవితలో ప్రస్ఫుటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే ఒక వర్గం మరో వర్గాన్ని పాలించినట్టు అవుతుంది. ఈ ప్రజాస్వామిక సూత్రంపై కట్టుబడి ఉన్నారు కాబట్టే బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అన్ని వర్గాల భాగస్వామ్యం కోసం పాటుపడుతున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. అలాగే చట్టసభల్లో మహిళలకు, బిసిలకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖలు రాయడాన్ని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ చేత తీర్మానం చేయించారు. పార్లమెంటులో ఈ అంశాలపై పోరాడాలని ఎంపిలకు సూచించారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతికి దోహదం చేస్తుందని సిఎం కెసిఆర్ మొదటి నుంచి చెప్తున్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. చట్టసభలో ప్రాతినిధ్యం దక్కినప్పుడే సమ్మిళితాభివృద్ధి సాధ్యమవుతుందన్న కెసిఆర్ భావన దేశ రాజకీయ లోకానికి కనువిప్పు కలిగించాలి. మహిళలు, బిసిలతో సహా సమాజంలోని అన్ని వర్గాలు పరిపాలనలో భాగస్వాములు అయినప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు ఇతర దేశాల్లోని అనుభవాలే సాక్ష్యం. సకల సంపద సృష్టికర్తలైన సబ్బండ వర్ణాల గ్రామీణ కులవృత్తుల వారు, మహిళలు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కలిగి లేకపోవడమేమిటని కెసిఆర్ ప్రశ్నించారు. అదే సమయంలో చట్టసభల్లో సీట్ల పెంపు ద్వారా మహిళా రిజర్వేషన్‌కు సానుకూలత ఏర్పరచాలని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సూచించారు.

సీట్ల పెంపు వల్ల ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పరిష్కారం లభిస్తున్నది. మహిళలు తమ రిజర్వేషన్ సాధించుకోవడానికి తాము ఉద్యమించాలనే భావన కవిత దేశ వ్యాప్తంగా కలిగించారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సోనియా మొదలుకొని అన్ని పక్షాల మహిళా నాయకులంతా ముందుకు రావాలని కవిత పిలుపు నివ్వడంతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన పిలుపే మహిళల రిజర్వేషన్ బిల్లుకు బాటలు వేసింది. ఇది దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైన ఘట్టం. మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు. అవకాశం లభిస్తే తమ ప్రతిభా సామర్థ్యాలను రుజువు చేసుకుంటూనే ఉన్నారు. కానీ, చట్టసభల్లో మహిళలకు తగినంత ప్రాధాన్యం ఉండడం లేదు. అందువల్ల కనీసం మూడోవంతు రిజర్వేషన్ కల్పించినప్పుడే వారికి ప్రాతినిధ్యం లభిస్తుంది.

మహిళలకు ప్రాతినిధ్యం పెరిగితే చట్టసభ చర్చలు మరింత అర్థవంతంగా జరుగుతాయి. మహిళా రిజర్వేషన్‌ను ఇంకా ఎంతో కాలం వాయిదా వేయలేమన్న అభిప్రాయంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. పదేండ్ల పాలనలో సిఎం కెసిఆర్ మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొదలుకొని కెసిఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్ వంటి పథకాల దాకా మహిళలకు లాభం చేకూర్చేవే. దేశాన్ని ఇప్పటి దాకా పాలించిన పార్టీ లేవీ మహిళా రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పని చేసిన దాఖలాలు లేవనే చరిత్ర చెప్తున్నది.

1996లో ప్రధాని దేవేగౌడ అధికారంలో ఉన్నపుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ మెట్లు ఎక్కింది. 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. కానీ లోక్‌సభలో మాత్రం వీగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా జరిగిన, జరుగుతున్న ప్రతీ పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా దేశ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం పోరాటం చేసే సంస్థలు, కార్యకర్తలు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం వారి రాష్ట్రాల్లో పోరాడుతూనే ఉన్నారు. ఈ డిమాండ్ల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ‘నారీ శక్తి వందన్’ మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అయితే, ఇదే సందర్భంలో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేసినట్లుగా చట్టసభల్లో సీట్ల సంఖ్యను పెంచాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది.

– పిఎల్ అలేఖ్య
(డైరెక్టర్ ఇంటర్నేషనల్ స్కూల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News