Monday, January 20, 2025

అంగన్‌వాడీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

- Advertisement -
- Advertisement -

స్వరాష్ట్రం ఏర్పడ్డాక వేతనాలు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌దే:  ఎమ్మెల్సీ కవిత

మన తెలంగాణ/ హైదరాబాద్ : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తంచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టంచేశారు. శనివారం అంగన్‌వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు కవితకు, తమ సమస్యలు పరిష్కరించిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సిఎం కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడమే కాకుండా ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించడం శుభపరిణామని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత వారికి ఆసరా పెన్షన్ కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగన్వాడీల భవిష్యత్తుకు భరోసానిస్తుందని చెప్పారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని తెలిపారు. అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గుర్తింపునిచ్చారని, ఇప్పటికే దేశంలో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో అరకొర వేతనాలు చెల్లిస్తుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీలకు ప్రభుత్వం మూడుసార్లు వేతనాలు పెంచిందని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం, ఆర్ధిక సాయం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్న సిఎం కెసిఆర్‌కు కవిత ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News