Saturday, December 21, 2024

మహిళా సాధికారతకు ప్రభుత్వం ముందడుగు

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికరతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. తొలుత స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి మంత్రి సత్యవతి, జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు, మహిళలు బతుకమ్మలు, బోనాలతో కోలాటాల ప్రదర్శనతో సమావేశ స్థలానికి ర్యాలీగా బయలుదేరారు.

మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. మహిళల సంక్షేమం కొరకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని, మహిళలు గర్భం దాల్చిన నాటి నుండి ఆడపిల్ల పెళ్లి చేసే వరకు వివిధ రకాల పథకాల అమలుకై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఆకాశంలో సగం ఉన్న మనం అవకాశాలు చేజిక్కించుకునే ప్రయత్నంతో ముండడుగు వేయాలని కాంక్షించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను దేశం అనుసరిస్తున్న దిశలో కెసిఆర్ పాలనా దక్షతను కొనియాడాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచి తలెత్తుకునేలా చేసిన ఘనత కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు.

నేడు సామాన్య మహిళలు కూడా ప్రజాప్రతినిధులుగా వేదికపై కూర్చోబెట్టినందుకు మహిళలు రుణపడి ఉంటారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అద్భుతం అన్నారు. మహిళలకు వడ్డీ లేని ఋణాలు, బ్యాంకు లింకేజి స్కీం క్రింద జిల్లాలో 22 కోట్ల రూపాయలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇటీవల వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం అందించడానికి చెక్కును వ్యవసాయశాఖాధికారులకు అందజేశారు. త్వరలో సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పేరిట మూడు లక్షల రూపాయలను అందజేయనున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా బేరువాడ గ్రామానికి చెందిన సింగర్ వరలక్ష్మి పాడిన బతుకమ్మ పాటకు మంత్రి సత్యవతి, ఎంపి మాలోత్ కవిత, మార్కెట్ ఛైర్‌పర్సన్ నీలం సుహాసినిలు స్టేజిపై స్టెప్పులేసి అలరించారు. ఎంపి మాలోత్ కవిత మాట్లాడుతూ దేశం మొత్తం కెసిఆర్ పాలన దక్షతను మెచ్చుకుంటుందని, ఇలాంటి సిఎం అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు. మిషన్ భగీరథతో ఆడబిడ్డలు నీళ్లబిందెలు తీసుకొని వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి వద్దకే శుభ్రమైన త్రాగు నీటిని అందించడం గొప్ప విషయమని కొనియాడారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ మహిళలు గౌరవింపబడిన చోట దేవతలు సంచరిస్తారని అన్నారు. మహిళా సాధికారత కొరకు వారి హాక్కుల సాధనకై ముందడుగు వేయాలని కాంక్షించారు.

ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మహిళాభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఆరోగ్యలక్ష్మి, కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, షీ టీమ్స్, ఆసక్తి గల మహిళలకు పారిశ్రామిక వేత్తల శిక్షణ, డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం, సఖి కేంద్రాలు, ఆసరా పెన్షన్లను అందిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా ఉద్యోగులకు 150 శాతం వేతనాలను ప్రభుత్వం పెంచిందన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ ఛైర్‌పర్సన్ నీలం సుహాసిని, ఎంపిపి ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్‌రెడ్డి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వద్దిరాజు కిషన్, ఆత్మ ఛైర్మెన్ నెహ్రు రెడ్డి, ధన్నసరి పిఎసిఎస్ ఛైర్మెన్ మర్రి రంగారావు, డా.సీతామహాలక్ష్మి, గూడూరు ఎంపిపి సుజాత, మహబూబాబాద్ జడ్పిటిసి ప్రియాంక, కేసముద్రం జడ్పిటిసి రావుల శ్రీనాథ్‌రెడ్డి, జడ్పి సిఈఓ రమాదేవి, ఆర్‌బిఎస్ మండలాధ్యక్షులు ప్రవీణ్‌కుమార్, సిడిపిఓ దెబోరా, ఎంపిటిసిలు ఆగె మంజుల, సట్ల వెంకన్న, నాయకులు నీలం దుర్గేష్, గుగులోతు వీరునాయక్, ఆగె వెంకన్న, భారాస పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నజీర్, కముటం శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News