- కోల్డ్ స్టోరేజీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి
షాబాద్: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని,కోల్డ్ స్టోరేజీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్ధార్‌నగర్ గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా రూ 2.30 కోట్లతో నాబార్డు నిధులతో నిర్మించిన కోల్డ్ స్టోరేజీని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డిసిసిబి చైర్మన్ మనోహర్‌రెడ్డి, స్థానిక ఎంపిపి కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి, జడ్పిటిసి పట్నం అవినాష్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, సర్పంచ్ స్వరూపాలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అదే విధంగా రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కోల్డ్‌స్టోరేజీల వల్లన రైతులు తాము పండించిన పంటలను వాటికి సరైన ధర వచ్చే వరకు కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేసుకుని సరైన ధర వచ్చాక అమ్ముకోవాలన్నారు. రైతులందరూ ఈ కోల్డ్‌స్టోరేజీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు వారు గుర్తు చేశారు. అదే విధంగా షాబాద్ మండలానికి ఇంకా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.